ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

14 Mar, 2023 05:50 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో సుమారు 4,17,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,19,790 మంది ప్రఽథమ, 1,97,950 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. సుమారు 548 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోని పరీక్ష కేంద్రాలకు మాత్రం అదనపు డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా స్థాయి పరీక్షల కమిటీ(డీఈసీ)తో పాటు హైపవర్‌ కమిటీ సభ్యులు సైతం ఆకస్మికంగా కేంద్రాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల నడుమ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి.

ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో వారు వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్‌ కిట్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు

హాల్‌ టికెట్లను వెబ్‌ సైట్‌ www.tsbie. egg. gov. in ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్‌ టికెట్‌ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

అర గంట ముందే చేరుకోండి..

పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్‌ పడకుండా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌

పరీక్షల నేపథ్యంలో రౌండ్‌ది క్లాక్‌ పని చేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 040– 24601010 లేదా 040– 24655027 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14416ను ఏర్పాటు చేశారు.

గ్రేటర్‌లో పరీక్షలు ఇలా..

జిల్లా పరీక్ష కేంద్రాలు - ప్రథమ -ద్వితీయ

హైదరాబాద్‌ -233 84,223 -86,923

రంగారెడ్డి జిల్లా -182 71,773 -55,883

మేడ్చల్‌– మల్కాజిగిరి -133 63,794- 55,144

మరిన్ని వార్తలు