హైదరాబాదీల అభిమానానికి ఫిదా | Sakshi
Sakshi News home page

హైదరాబాదీల అభిమానానికి ఫిదా

Published Tue, Mar 14 2023 5:50 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ భాష, యాస.. ఇక్కడి ప్రజల అమితమైన ప్రేమంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ బాలీవుడ్‌ హాస్యనటుడు కపిల్‌ శర్మ అన్నారు. బాలీవుడ్‌ తార నందితాదాస్‌ దర్శకత్వంలో కపిల్‌ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘జ్విగాటో’ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం నగరంలోని హోటల్‌ ది పార్క్‌ వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కపిల్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా తన ప్రయాణంలో మైలురాయిగా మారుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఒక మంచి కమెడియన్‌గా గుర్తింపున్న తాను మానసిక స్పందనలను ప్రభావితం చేసే సీరియస్‌ పాత్రను పోషించానని చెప్పారు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా మారిన వ్యక్తి జీవితాన్ని, తన చుట్టూ జరిగిన హృద్యమైన సంఘటనలతో ‘జ్విగాటో’ సినిమా ఉంటుందన్నారు. ఈ పాత్ర పోషించాక తన జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చిందని, సామాన్యుల జీవన స్థితిగతులను నెమరువేసుకుంటున్నానని పేర్కొన్నారు.

● ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తమ కోసం తీసుకువచ్చిన కేక్‌ పొరపాటున తిప్పి ఉండటంతో అది పూర్తిగా పాడైందని, ఆ సమయంలో అదే కేక్‌ను కట్‌ చేసి వేడుకలు జరుపుకొన్నామని ఆయన చెప్పారు. సిమాలోని పాత్ర తనపైన అంతటి ప్రభావం చూపించిందని గుర్తు చేసుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నాటు నాటు పాటలకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడం దేశానికే గర్వకారణమన్నారు. రామ్‌చరణ్‌ వ్యక్తిత్వం బాగుంటుందని, తారక్‌ హిందీ చాలా బాగా మాట్లాడుతారని తెలిపారు.

● కపిల్‌ శర్మను మొదటిసారిగా ఒక ఇవెంట్‌లో చూశానని, తను చాలా సాధారణంగా, సామాన్యుడిగా అనిపించారని, అందుకే ఈ పాత్రకు తనను ఎంచుకున్నానని దర్శకురాలు నందితా దాస్‌ తెలిపారు. మన చుట్టూ జరిగే వాస్తవ జీవన గాథలే ఈ సినిమాలో ప్రస్తావించానన్నారు. కష్టాలు, వేదన, జీవన పోరాటం, సంతోషం, ప్రేమ అన్నీ ఈ సినిమాకు ప్రాణం పోశాయని చెప్పారు. హైదరాబాద్‌లో గతంలో కూడా షూటింగ్‌ కోసం వచ్చానని, సిటీతో మంచి అనుబంధం ఉందని కథానాయిక షహానా గోస్వామి తెలిపింది.

ఫిక్కీ ఆధ్వర్యంలో డేర్‌ టు లాఫ్‌

పంజగుట్ట: సోమాజిగూడ పార్క్‌ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డేర్‌ టు లాఫ్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ హాస్య నటుడు కపిల్‌ శర్మతో ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో నాన్నలా పోలీస్‌ కావాలనుకున్నానని, తర్వాత గాయకుడు అనుకున్నానని కానీ కమెడియన్‌గా మీ ముందుకు వచ్చానన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ ప్రతినిధి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సుస్వరాల భాగ్యగ్యం

నాటు.. నాటు పాటకు ఆస్కార్‌ పురస్కారం

కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ సిటీ కుర్రాళ్లే

విశ్వ సినీ చరిత్రలో మన నగరానికి ఖండాంతర ఖ్యాతి

కాలభైరవ, రాహుల్‌ ఇరువురు గాయకులపై అభినందనల వెల్లువ

తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ నాటు.. నాటు పాట నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారానికి ఎంపికై హైదరాబాద్‌ మహా నగరం పేరును విశ్వ వ్యాప్తం చేసింది. సిటీకి చెందిన గాయకులు పాడిన పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడంతో నవయువ విజయాల భాగ్య ‘నగ’రి మణిహారంలో మరో ఆణిముత్యం జత చేరింది. టాలీవుడ్‌ రాజధానిగా.. సినిమాల తయారీకి చిరునామాగా ఉన్న నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ఆస్కార్‌ పురస్కారం వరించడం సిటిజనులకు గర్వకారణంగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రూపకర్తలు, కథా నాయకులు, నృత్య దర్శకుడు... అందరూ మన సిటిజనులే కాగా నాటు నాటు పాడిన ఇద్దరు యువ గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇక్కడే పుట్టి పెరిగిన వారు కావడంతో సంతోషం ద్విగుణీకృతమైంది. –సాక్షి, సిటీబ్యూరో

ధూల్‌పేట్‌లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..

● నగరంలోని ధూల్‌పేట్‌కు చెందిన ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. ఇంట్లోని గిన్నెలు, స్టీలు ప్లేట్ల మీద దరువేసిన నాటి అల్లరి కుర్రోడు ఆస్కార్‌ ను ఇంటికి తెచ్చేసుకున్నాడు. నిన్నా మొన్నటి దాకా మన మధ్యనే ఆడి పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖుల మధ్య పాడి ఆడించాడు.

● చిన్నవయసులో గజల్‌ మాస్టర్‌ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన రాహుల్‌.. మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేశాడు. ఏడేళ్ల శిక్షణలో గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే సినిమాల్లో కోరస్‌గా అలా అలా నాగ చైతన్య తొలి చిత్రం జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ పాటతో అవకాశం వచ్చింది.

● ఆ తర్వాత తను పాడిన పాటల సీడీని తీసుకు వెళ్లి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణికి వినిపించి, ఆయన సంగీత దర్శకత్వంలో ‘వాస్తు బాగుందే’ అనే పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘ఈగ’లో టైటిల్‌ సాంగ్‌, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో బోనాలు.. వంటి వరుస హిట్‌ సాంగ్స్‌తో స్టార్‌ సింగర్‌గా ఎదిగిపోయాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా స్వయంగా రూపొందిస్తూ.. మంగమ్మ, పూర్‌ బాయ్‌, మాకీ కిరికిరి’, ’గల్లీకా గణేష్‌’, ’దావత్‌’.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలకు తనదైన గానాన్ని జతచేసి సక్సెస్‌ సాధించాడు. గత 2019లో బిగ్‌బాస్‌ సీజ న్‌–3లో గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాలభైరవ.. గాన వైభవ..

ప్రముఖ సంగీత దర్శకుడు, నాటు నాటు పాటకు స్వరాలద్దిన కీరవాణి తనయుడు కాలభైరవ.. గత కొంత కాలంగా గాయకుడిగా రాణిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పాడుతున్నాడు. గాయకుడిగానే కాకుండా మత్తు వదలరా, కలర్‌ ఫొటో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సత్తా చాటాడు. బాహుబలి 2లో దండాలయ్యా...పాటతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. నాటు నాటు పాటలో సహ గాయకుడు రాహుల్‌తో కలిసి స్వరం కలిపి ఏకంగా ఆస్కార్‌నే అందుకున్నాడు.

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement