ఘన వ్యర్థాలపై నజర్‌ | Sakshi
Sakshi News home page

ఘన వ్యర్థాలపై నజర్‌

Published Tue, Mar 14 2023 5:50 AM

-

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం బల్క్‌ గార్బేజ్‌ తరలింపుపై దృష్టి సారించింది. బల్క్‌ గార్బేజ్‌ ఉత్పత్తి చేసేవారు దానిని స్వచ్ఛ ఆటోల ద్వారా తరలించరాదు. జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసిన సంస్థ ద్వారానే ప్రత్యేక వాహనాల్లో తరలించాలి. ఇప్పటి వరకు ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించలేదు. బల్క్‌ గార్బేజ్‌ను సైతం స్వచ్ఛ ఆటోల ద్వారా తరలిస్తుండటంతో అది ఇళ్లనుంచి చెత్త తరలింపుపై ప్రభావం చూపుతోంది. బల్క్‌ గార్బేజ్‌ ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు తదితర సంస్థల నుంచి చెత్తను తరలిస్తే తమకు ఎక్కువ ఆదాయం వస్తుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఇళ్లకు వెళ్లకుండా వాటి వ్యర్థాలనే ఆటోల్లో తరలిస్తున్నారు. తద్వారా ఇళ్లలో చెత్త ప్రతిరోజూ తరలడం లేదు. మరోవైపు బల్క్‌ గార్బేజ్‌ ఉత్పత్తిదారులు తరలింపునకు చెల్లించాల్సిన నిర్ణీత చార్జీలు చెల్లించడం లేదు.

● సగటున రోజుకు వంద కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలను వెలువరించే హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మాల్స్‌, ఫంక్షన్‌ హాళ్లు తదితర సంస్థల నిర్వాహకులను బల్క్‌గార్బేజ్‌ ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగమైన ఈ తరలింపునకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువరించిన ఏడాదిలోగా సదరు సంస్థలన్ని జీహెచ్‌ఎంసీ గుర్తింపునిచ్చిన ఏజెన్సీ ద్వారానే తరలించాలి. ఇందుకు సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువరించిన జీహెచ్‌ఎంసీ.. వీటిని తరలించే ఏజెన్సీగా హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్‌ను గుర్తించింది.

● బల్క్‌ గార్బేజి తరలింపునకు కేజీకి రూ.2.90 యూజర్‌చార్జీగా నిర్ణయించింది. చెత్త సేకరణనుంచి రవాణా ట్రీట్‌మెంట్‌ వరకు ఈ చార్జీ నిర్ణయించింది. ఒకవేళ బల్క్‌ గార్బేజ్‌ ఉత్పత్తిదారులే తమ గార్బేజ్‌ను నిబంధనలు పాటిస్తూ చెత్త నిర్వహణ కేంద్రానికి తరలిస్తే కేజీకి రూ.1.16 చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ వెలువడి దాదాపు ఆర్నెల్లవుతుండగా, ఇప్పటి వరకు ఇది అమల్లోకి రాకపోవడంతో జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం ఈ అంశంపై దృష్టి సారించింది. నోటిఫికేషన్‌ మేరకు నిబంధనలు అమలయ్యేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు.

● ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు ఈ విధానాన్ని అమలు చేయని వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఎంపిక చేసిన ఏజెన్సీ ప్రత్యేక వాహనాల్లో నిబంధనలకనుగుణంగా వ్యర్థాలను తరలిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement