TS Crime News: ఉద్యోగానికి అడ్డొచ్చాడని.. కంట్రీమేడ్‌ పిస్టల్‌తో కాల్పుల కలకలం..!

25 Aug, 2023 10:40 IST|Sakshi

హైదరాబాద్‌: వారిద్దరు ఓ హోటల్‌లో ఉన్నతోద్యోగులుగా పని చేస్తున్నారు. జీఎం పోస్టు వారి మధ్య చిచ్చు రేపింది. పని బాగా చేస్తుండటంతో ఒకరిని జీఎం పోస్టు వరించింది. పని తీరు సరిగా లేకపోవడంతో మరొకరి జీఎం ఊడింది. దీంతో సహనం కోల్పోయిన మాజీ జనరల్‌ మేనేజర్‌ కొత్త జీఎంతో గొడవకు దిగడంతో మేనేజ్‌మెంట్‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తన ఉద్యోగం పోవడానికి అతడే కారణమని కక్ష పెంచుకున్న అతను రెక్కీ నిర్వహించి కంట్రీమేడ్‌ పిస్టల్‌తో కాల్చి చంపాడు. నిందితుడిని మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గురువారం మాదాపూర్‌ డీసీపీ సందీప్‌ రావు కేసు వివరాలు వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్‌ గయాన్‌(35) పదేళ్లుగా హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో పని చేస్తున్నాడు. 9 నెలలుగా మదీనాగూడలోని సందర్శిని ఎలైట్‌ హోటల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే హోటల్‌లో కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌కు చెందిన రితీష్‌ నాయర్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. దేవేందర్‌ పని తీరు నచ్చడంతో హోటల్‌ యాజమాన్యం రితీష్‌ను తొలగించి అతడి స్థానంలో దేవేందర్‌ను జనరల్‌ మేనేజర్‌గా నియమించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో హోటల్‌ నిర్వాహకులు నెల రోజుల క్రితం రితీష్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో దేవేందర్‌పై కక్ష పెంచుకున్న రితీష్‌ బీహార్‌ వెళ్లి కంట్రీమేడ్‌ పిస్టల్‌ కొనుగోలు చేసి తిరిగి నగరానికి వచ్చాడు. కొద్ది రోజులుగా దేవేందర్‌ను హత్య చేసేందుకు సందర్శిని ఎలైట్‌ హోటల్‌ వద్ద రెక్కీ నిర్వహించాడు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో సందర్శిని ఎలైట్‌ హోటల్‌ పార్కింగ్‌లో హెల్మెట్‌ ధరించి కాపు కాచాడు.

రాత్రి 9.40 గంటల సమయంలో దేవేందర్‌ హోటల్‌ నుంచి బయటికి రాగానే రితీష్‌ నాయర్‌ అతడిపై కాల్పులు జరిపాడు. ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఐదు బుల్లెట్లు దేవేందర్‌ శరీరంలోకి చొచ్చుకెళ్లాయి, ఒక బుల్లెట్‌ మిస్‌ అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని హోటల్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

కేరళ వెళ్లేందుకు మెట్రో స్టేషన్‌ వేచి ఉన్న రితీష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి కంట్రీ మేడ్‌ పిస్టల్‌, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీహార్‌లో పిస్టల్‌ ఎక్కడ కొనుగోలు చేశాడు, అతని సహకరించిన వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. సమావేశంలో మాదాపూర్‌ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు, మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్‌ఓటీ సీఐ శివ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు