Telangana: బీజేపీ అగ్ర నేతల క్యూ.. మోదీ, అమిత్‌ షా, నడ్డా, నిర్మల, రాజ్‌నాథ్‌, ఇంకా ఎందరో..

21 Nov, 2023 09:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చివరి 8 రోజులు పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో పలువురు బీజేపీ ముఖ్యనేతలు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలు రోజు విడిచి రోజు పర్యటనలకు వస్తున్న సంగతి తెలిసిందే.

పార్టీపరంగా, స్వతంత్ర సంస్థలు, ఇతర రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని జాతీయ నాయకత్వం మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తృత పర్యటనలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 27న హైదరాబాద్‌ నగరంలో మోదీ రోడ్‌షో ఉంటుందని తెలుస్తోంది. మొత్తం ఆరు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీవర్గాల సమాచారం.
చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్‌.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం

కాగా ఈ పర్యటన సందర్భంగా మోదీ రాజ్‌భవన్‌లో బసచేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నెల 23న ముథోల్, సంగారెడ్డి , నిజామాబాద్‌ అర్బన్‌లలో సభలకు హాజరుకావడంతో పాటు హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారు. 25, 26, 27 తేదీలలో కూడా వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, రోడ్‌షోలలో పాల్గొంటారు.

మరోవైపు 24, 26, 28 తేదీలలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రోడ్‌షోతో ఆయన పర్యటన ముగించే అవకాశాలున్నట్లు తెలిసింది. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ ఈ నెల 24, 25, 26 తేదీలలో 10 బహిరంగ సభల్లో పాల్గొననున్నట్టు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలో రోడ్‌షో ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ నెల 24, 26 తేదీలలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరు సభల్లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇక ఈ నెల 22 నుంచి 27 వరకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివిధ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 

మరిన్ని వార్తలు