తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌కు చెందిన డబ్బు మాయం

30 Sep, 2023 08:07 IST|Sakshi

హైదరాబాద్: సొంత ఇంటికి యజమానులే కన్నం వేశారు. బ్యాంకు అధికారులతో కలసి ‘తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌’ ఎఫ్‌డీ అకౌంట్స్‌లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు సభ్యులు ఆ ఇంటి దొంగల్ని ప్రశ్నించగా వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పక్కా ఆధారాలతో యూనియన్‌లోని సభ్యులు రాందాస్‌ ధన్‌రాజ్‌, వెంకటేశ్వరరావులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు యూనియన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్‌, ట్రెజరర్‌ రాజేష్‌లపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు 420 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని ‘తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌’ ఎన్నో సంవత్సరాలుగా ఉంది.

దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్‌, ఉపాధ్యక్షులతో కలపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్‌లో ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లో ఖాతా ఉంది. దీనిలో ఎఫ్‌డీ, ఇతర లావాదేవీలు కలిపి మొత్తం రూ. 7 కోట్లు ఉన్నాయి. యూనియన్‌ బైలా ప్రకారం యూనియన్‌లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ప్రెసిడెంట్‌ సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్‌, ట్రెజరర్‌ రాజేష్‌లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్‌ చూశామంటూ రాంపూర్‌ వద్దకు సభ్యులు రాందాస్‌ ధన్‌రాజ్‌, వెంకటేశ్వరరావు తదితరులను తీసుకెళ్లారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి ఓనర్‌ నుంచి ఇతను అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు చెప్పారు.

అడ్వాన్స్‌ కూడా నాలుగు రోజుల ముందే ఇచ్చినట్లు చెప్పడంతో రాందాస్‌ ధనరాజ్‌, వెంకటేశ్వరరావులు అలా ఏకపక్షంగా ఎలా ఇస్తారని ప్రెసిడెంట్‌, జీఎస్‌, ట్రెజరర్‌లను నిలదీశారు. దీంతో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పండతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే యూనియన్‌లో ఉన్న 60 మంది అనుకూలమైన వ్యక్తులకు ప్రెసిడెంట్‌, ట్రెజరర్‌, జీఎస్‌లు కొత్త అకౌంట్‌లు ఓపెన్‌ చేయించారు. ఆ అకౌంట్‌లలో యూనియన్‌కు చెందిన ఎఫ్‌డీలోని రూ.7 కోట్లలో ఒక్కోక్కరికీ రూ.9 లక్షల చొప్పున బదిలీ చేశారు.

ఈ 60 మందికి వచ్చిన దాదాపు రూ.5 కోట్ల 40 లక్షలు క్యాష్‌ రూపంలో డ్రా చేయించి ముగ్గురూ తీసుకున్నారు. మరికొంత కూడా వివిధ కారణాలు చెప్పి డ్రా చేశారు. ఇలా పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు యూనియన్‌ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో రాందాస్‌ ధనరాజ్‌, వెంకటేశ్వరరావు, మరికొందరు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ చింతపల్లి మల్లికార్జున చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు