ఎలక్షన్‌ అలర్ట్‌ !

7 Oct, 2023 11:13 IST|Sakshi

హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారులు, సెక్టోరల్‌ నోడల్‌ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, జీఎస్టీ, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్‌బీఐ, కస్టమ్స్‌, ఎన్‌సీబీ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌తో కలిసి రోనాల్డ్‌రాస్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం, ధనప్రవాహం లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సమష్టిగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.

మద్యం షాపుల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండాలని, వాటిని పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎకై ్సజ్‌, పోలీస్‌, జీఎస్టీ విభాగాల అధికారులు జాయింట్‌గా ఆపరేషన్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా భారీగా జరిగే నగదు బదిలీలపై ఆర్‌బీఐ, ఎస్‌ఎల్‌బీసీలు తగిన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసే వారి వివరాలు సేకరించి విచారణ జరపాలన్నారు. నగదు తరలింపు, తదితరమైన వాటికి సంబంధించి వాహనాల కదలికలను జీపీఎస్‌ సిస్టమ్‌తో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి పరిశీలిస్తామని చెప్పారు.

ఉచిత పంపిణీల సందర్భంగా కన్సూమర్స్‌ గూడ్స్‌పై కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగం నిఘా ఉండాలన్నారు. గంజాయి తరలింపు ప్రాంతాల గుర్తింపునకు ఎన్‌సీబీ (నార్కోటిక్‌ కంట్రోల్‌బ్యూరో) ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెక్టోరల్‌ అధికారులు విధులకు హాజరు కాని పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. వల్నరబుల్‌ (సమస్యాత్మక) పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ చేసి, వాటిని మూడుసార్లు సందర్శించాలన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల ఏర్పాటు: సీవీ ఆనంద్‌
పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ, గుర్గావ్‌, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి అక్రమంగా తరలించే నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి నియంత్రణకు విజయవాడ రోడ్‌లోని పెద్దఅంబర్‌ పేట్‌, ఘట్‌కేసర్‌ సరిహద్దులు తదితర ప్రాంతాల్లో ఎన్‌సీబీ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు.

అవసరమైన ప్రాంతాల్లో ఎకై ్సజ్‌, జీఎస్టీ, ఆర్టీఏ, పోలీసు విభాగాలతో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. వల్నరబుల్‌ ప్రాంతాల మ్యాపింగ్‌లో అలసత్వం వహించవద్దని, సెక్టోరల్‌ అధికారులు తమ పరిధిలో పూర్తి నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అడిషనల్‌ కమిషనర్‌(ఎన్నికలు)శంకరయ్య, కంటోన్మెంట్‌ సీఈఓ మధుకర్‌నాయక్‌ ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు