కొబ్బరి నీళ్లు పంచినా అభ్యంతరమేనట!?

21 Oct, 2023 07:38 IST|Sakshi

హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికారులు డబ్బులు పట్టుకుంటున్నారు.. నగలు పట్టుకుంటున్నారు.. బంగారం పట్టుకుంటున్నారు.. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిస్సహాయులకు, రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు కొబ్బరి నీళ్లు పంచుతుండగా అభ్యంతరం చెప్పిన ఘటన చర్చనీయాంశమైంది. రహదారులపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల దప్పిక తీర్చడం కూడా తప్పేనా? ఇవేం రూల్స్‌ అంటూ ఆ మహిళా ప్రతినిధి నిట్టూరుస్తూ వెళ్లిపోవడం గమనార్హం.

వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి డాక్టర్‌ విజయలక్ష్మి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కొబ్బరినీళ్ల సీసాలను అందిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎన్నికల అధికారులు ఆమె వాహనాన్ని ఆపి ‘ఏం పంపిణీ చేస్తున్నారు’? అని ప్రశ్నించారు.

ఆమె చెప్పిన జవాబు విన్న అధికారులు ఎన్నికల సమయంలో అవేవీ కుదరవమ్మా అంటూ హితవు పలి కారు. మంచినీళ్లు ఇవ్వాలన్నా, అన్నదానాలు చేయాలన్నా, కొబ్బరినీళ్లు పంచాలన్నా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. తాను 15 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇవేం దిక్కుమాలిన రూల్స్‌ అంటూ కారెక్కి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు