ఎమ్మెల్యే హర్షవర్ధన్‌, ఎమ్మెల్సీ చల్లా వేధిస్తున్నారు! : చంద్రశేఖర్‌ వేగే

27 Oct, 2023 08:04 IST|Sakshi
గోల్డ్‌ఫిష్‌ అబోడ్‌ కంపెనీ ఎండీ చంద్రశేఖర్‌ వేగే

కోకాపేటలోని 2.30 ఎకరాల భూ వివాదం..

గోల్డ్‌ఫిష్‌ కంపెనీతో చల్లా డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌!

కంపెనీ వాటాలను నిర్ధారించకుండా తాత్సారం..

పదేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు

గోల్డ్‌ఫిష్‌ అబోడ్‌ కంపెనీ ఎండీ చంద్రశేఖర్‌ వేగే అరోపణలు..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనను వేధిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో తనపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని గోల్డ్‌ఫిష్‌ అబోడ్‌ కంపెనీ ఎండీ చంద్రశేఖర్‌ వేగే అరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమపై పీడీ యాక్ట్‌ నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

తప్పుడు పత్రాలు, ఆరోపణలతో తనపై, తన కంపెనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోకాపేటలోని స్థలంపై గోల్డ్‌ ఫిష్‌ సంస్థకు, ఎమ్మెల్సీ చల్లాకు మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చల్లా చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో చంద్రశేఖర్‌ వేగే విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...

► కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2.30 ఎకరాల స్థలంలో ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో కంపెనీ డైరెక్టర్‌ కాటం అశ్వంత్‌ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన పెట్టుబడిదారుడిగా తన సమీప బంధువైన చల్లా వెంకట్రామిరెడ్డి ఆసక్తిగా ఉన్నారని చెప్పడంతో సంస్థ యాజమాన్యం అందుకు అంగీకరించింది. దీంతో కంపెనీ ప్రతినిధి వాసుదేవరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి సర్వే నంబరు–85లో ఉన్న 2.30 ఎకరాల వ్యవసాయ భూమిని అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ హోల్డర్స్‌గా 2013 మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఈస్థలాన్ని ఎమ్మెల్సీ, ఇతరుల పేర్లపై సేల్‌డీడ్‌ పూర్తి చేశాం.

► నిబంధనల ప్రకారం 2013 మేలో చల్లా వెంకట్రామిరెడ్డి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు డెవలప్‌మెంట్‌ కమ్‌ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ చేస్తూ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 4 బేస్‌మెంట్లు గ్రౌండ్‌ 38 అంతస్తులలో హైరైజ్‌ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం.

► ఈ మేరకు ప్రొవిజన్‌ నిర్మాణ అనుమతుల కోసం 2014 జూన్‌లో దరఖాస్తు చేసుకోగా.. డిసెంబర్‌ 12 నాటికి భూ మార్పిడి, హెచ్‌ఎండీఏ నుంచి నిర్మాణ అనుమతులతో పాటు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, ఫైర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, పర్యావరణ అనుమతులన్నీ లభించాయి. అయితే 2014లో రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు సద్దుమణిగే వరకూ కంపెనీ, ఎమ్మెల్సీ ఇరువురూ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను నెమ్మదించాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే తొలుత పెట్టిన పెట్టుబడులకు అదనంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాం.

► హెచ్‌ఎండీఏ నుంచి తుది అనుమతులు, కంపెనీ బిల్టప్‌ ఏరియా వాటాలను నిర్ధారించే సప్లిమెంటరీ అగ్రిమెంట్‌పై ఎమ్మెల్సీ సంతకాలు చేయకుండా తాత్సారం చేశారు. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ప్రాజెక్ట్‌ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది.

ప్రాథమిక ఒప్పందంలో లేని అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీ కొత్త ఒప్పందాన్ని ఎమ్మెల్సీ ముందు ఉంచింది. ప్రాజెక్ట్‌ కొనసాగించడం ఎమ్మెల్సీకి ఇష్టంలేని పక్షంలో వారు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు అంటే రూ.40 కోట్లు చెల్లిస్తామని, ఆ తర్వాత ఒప్పందం నుంచి వైదొలిగితే ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను కంపెనీ టేకోవర్‌ చేస్తుందని వివరించాం.

► అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరించని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనకున్న రాజకీయ పలుకుబడితో గోల్డ్‌ఫిష్‌ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులపై కేసులు పెట్టించడం మొదలుపెట్టారు. దీంతో కంపెనీ ఎండీ అయిన నేను 21 రోజుల పాటు జైలులో గడపడమే కాకుండా పలు ప్రభుత్వ అధికారులు, నాయకుల నుంచి ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాలను ఎదుర్కోలేక చల్లా వెంకట్రామి రెడ్డి తమను మోసగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు