మిస్ట‌రీగా మారిన 'కాంగో జాతీయుడి లాక‌ప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?

12 Dec, 2023 12:31 IST|Sakshi

డ్రగ్‌ పెడ్లర్స్‌కు అడ్డాగా మారిన బెంగళూరు!

ఒకప్పుడు ఆ నగరంలోనూ వీరిపై ఉక్కుపాదం..

2021లో డ్రగ్స్‌ కేసులో చిక్కిన కాంగో జాతీయుడు..

ఠాణా లాకప్‌లో అతను చనిపోవడంతో రచ్చరచ్చ!

ఆ ఉదంతంలో ఉదాశీనంగా మారిన అక్కడి పోలీసులు..

కట్టడికి ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న అధికారులు!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌–నాబ్‌), హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, సైబరాబాద్‌, రాచకొండలకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌లతో (ఎస్‌ఓటీ) పాటు స్థానిక పోలీసులకు చిక్కిన ప్రతి నాలుగు డ్రగ్‌ ముఠాల్లో మూడింటి లింకులు బెంగళూరులో ఉంటున్నాయి. ఆ నగరం డ్రగ్‌ పెడ్లర్స్‌, సప్లయర్లకు అడ్డాగా మారడానికి దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓ లాకప్‌ డెత్‌ కారణమైంది. దీనిని గమనించిన రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.

ఒకప్పుడు గోవా.. ఇప్పుడు బెంగళూరు..
నగరంలో ఎక్కువగా లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి సంబంధితమైన వాటి తర్వాతి స్థానంలో సింథటిక్‌ డ్రగ్స్‌ ఉంటున్నాయి. గంజాయి, చెరస్‌, హష్‌ ఆయిల్‌ తదితరాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నాయి. కోకై న్‌, బ్రౌన్‌షుగర్‌, హెరాయిన్‌ తదితర సింథటిక్‌ డ్రగ్స్‌ మూలాలు మాత్రం విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడకు సరఫరా మాత్రం ఉత్తరాదితో పాటు బెంగళూరు నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఈ డ్రగ్‌ డాన్స్‌ అంతా గోవా కేంద్రంగా కథ నడిపే వారు. హైదరాబాద్‌ పోలీసులు వరుస దాడులు చేసి ఎడ్విన్‌, స్టీవ్‌ సహా బడా డ్రగ్‌ డాన్స్‌కు చెక్‌ చెప్పారు. దీంతో ఇక్కడి వారికి గోవా నుంచి డ్రగ్స్‌ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో బెంగళూరు కేంద్రంగా సరఫరా మొదలైంది.

ఆ నగరమూ విదేశీయుల అడ్డా..
బెంగళూరుతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో తిష్ట వేసి, డ్రగ్స్‌ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉంటున్నారు. స్టడీ, బిజినెస్‌, విజిట్‌ సహా వివిధ రకాలైన వీసాలపై వస్తున్న నైజీరియా, సూడాన్‌, సోమాలియా, కాంగో జాతీయులు డ్రగ్‌ పెడ్లర్స్‌, సప్లయర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇతర నగరాలతో పాటు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

2021 ప్రథమార్ధం వరకు ఆ నగరంలో నేరాలు చేస్తున్న, అక్రమంగా నివసిస్తున్న ఇలాంటి వారిపై ఉక్కుపాదం మొపేవారు. వీళ్ళు సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బెంగళూరులోని అలాంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేసే అక్కడి పోలీసులు అక్రమంగా నివసిస్తున్న, దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఒక్క ఉదంతంలో అడ్డం తిరిగిన కథ..
ఆ నగరంలో 2021 ఆగస్టులో చోటు చేసుకున్న ఓ ఉదంతంతో కథ అడ్డం తిరిగింది. కాంగోకు చెందిన జోయల్‌ షిండానీ ములు (27) స్టడీ వీసాపై బెంగళూరుకు వచ్చాడు. డ్రగ్స్‌ పెడ్లింగ్‌ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన ఇతడిని 2021 ఆగస్టులో జేసీ నగర్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఠాణాలోనే అతడు చనిపోయాడు.

కార్డియాక్‌ అరెస్టు వల్ల మరణం సంభవించిందని పోలీసులు చెప్పగా, పోలీసులే కొట్టి చంపారని నల్లజాతీయులు ఆరోపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆ ఠాణా వద్దకు చేరుకున్న నల్లజాతీయులు రాళ్లు రువ్వడంతో పాటు నిరసన చేపట్టారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ ఘర్షణలు అక్కడి పోలీసులు ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామం తర్వాత ఆ నగర అధికారులు నల్లజాతీయుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పరిస్థితులు చేయి దాటుతుండటంతో..
దీనిని అలుసుగా చేసుకున్న అనేక మంది డ్రగ్‌ పెడ్లర్స్‌, సప్లయర్స్‌ బెంగళూరును అడ్డాగా మార్చుకున్నారు. ఇతర మెట్రోల్లో నివసించే నల్లజాతీయులు సైతం ఆ నగరానికి వచ్చివెళ్తూ డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. కొన్ని రకాలైన డ్రగ్స్‌ విదేశాల నుంచి నేరుగా కర్ణాటకలోని వివిధ నగరాలకు వచ్చి బెంగళూరు చేరుతున్నాయి. అక్కడ నుంచే హైదరాబాద్‌ సహా వివిధ నగరాలకు సరఫరా అవుతున్నాయి.

ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న డ్రగ్‌ పెడ్లర్స్‌కు చెక్‌ చెప్పడానికి, మాదకద్రవ్యాల దందాను కట్టడి చేయడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అవసరమైతే దీనిపై కేంద్ర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి సూత్రధారులను పట్టుకోవడానికి వెళ్లినా సరైన సహకారం లభించకపోవడాన్నీ ప్రస్తావించనున్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: అగ్నిసాక్షిగా ఏడడుగులు.. అంతలోనే అంతర్వేది బీచ్‌లో విషాదం!

>
మరిన్ని వార్తలు