మోసాల కోసం కాల్‌ సెంటర్‌!

25 Dec, 2023 08:19 IST|Sakshi
నిందితుడు విజయ్‌ కాంత్‌

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసిన సైబర్‌ నేరగాడు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేశాడు. నగరానికి చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ (నేరాలు) ఏవీ రంగనాథ్‌ ఆదివారం వెల్లడించారు. నోయిడాకు చెందిన విజయ్‌ కాంత్‌ అక్కడే ఓ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశాడు. తమ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతీయువకులు టెలీకాలర్స్‌గా ఏర్పాటు చేసుకున్నాడు.

వివిధ రకాలైన అధికారిక జాబ్‌ పోర్టల్స్‌ నుంచి ఉద్యోగార్థుల ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నాడు. వీటిని తన కాల్‌ సెంటర్‌లో పని చేసే టెలీకాలర్లకు ఇచ్చి వారికి ఫోన్లు చేయిస్తున్నాడు. నాంపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఈ టెలీకాలర్లు సందేశం పంపారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అధికారుల పోస్టులు ఉన్నాయని అందులో నమ్మబలికారు. బాధితురాలు ఆసక్తి చూపడంతో ఆమెకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ ద్వారానే ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసేశారు. ఈ తంతు పూర్తి చేసిన తరవాత ఉద్యోగానికి ఎంపికై నట్లు చెప్పి నకిలీ ఆఫర్‌ లెటర్‌ కూడా పంపారు. వీటికోసం అంటూ రిజిస్ట్రేషన్‌ తదితర ఫీజుల పేరుతో రూ.2,20,327 వివిధ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. నగదు ముట్టిన తర్వాత మొహం చాటేశారు.

బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన స్పందించలేదు. దీంతో తాను మోసపోయినని గుర్తించిన యువతి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఏసీపీ ఆర్‌జీ శివమారుతి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ కె.మధుసూదన్‌ రావు నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలు బట్టి ముందుకు వెళ్ళిన అధికారులు విజయ్‌కాంత్‌ ప్రధాన నిందితుడని, అతడు నోయిడాలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఇతడి కాల్‌ సెంటర్‌ నుంచి ఆరు ల్యాప్‌టాప్స్‌, 23 సెల్‌ఫోన్లు, ఎనిమిది చెక్‌బుక్స్‌, ఆరు బ్యాంకు కార్డులు, 80 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు