ఏడున్నరేళ్లుగా..

17 Jan, 2024 05:56 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన రిటైర్డ్‌ అధికారుల పీఠాలు కదలనున్నాయి. కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే రిటైరై.. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న అధికారుల వివరాల కోసం ఆదేశాలు జారీ కావడంతో వాటర్‌ బోర్డులో హడావుడి ప్రారంభమైంది. జలమండలిలో ఈడీ పోస్టుతో సహా సుమారు 14 మంది జీఎం, ఏజీఎం లాంటి కీలక పోస్టుల్లో కొంత మంది కొనసాగుతున్నారు. ఇప్పటికీ వాళ్లంతా సీటు వదిలేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సంబంధిత శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి అండతో తిరిగి కొనసాగేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిటైర్డ్‌ అధికారులు అన్ని విభాగాలపై పెత్తనం కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అధికారి అయితే నిర్వహణ మొదలుకుని ప్రాజెక్టుల వరకు ఆయన కనుసన్నల్లో నడిపే విధంగా ప్రభావితం చేస్తున్నట్టు చర్చ ఉంది. మరోవైపు రిటైర్డ్‌ అధికారులు తిష్ట వేసిన కారణంగా జలమండలిలో పదోన్నతుల పోస్టులకు ఆటంకం ఏర్పడింది.

ఏడున్నరేళ్లుగా..

జలమండలి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా కొనసాగుతున్న ఉన్నతాధికారి 2016 లోనే ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ రెండేళ్ల పాటు ఈడీగా కొనసాగేందుకు గడువు పొడిగించింది. ఆ తర్వాత మళ్లీ మరో రెండేళ్ల చొప్పన పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం మారినప్పటికీ ఈడీతో సహా మిగతా రిటైర్డ్‌ అధికారులు సైతం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఆశీస్సులతో కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు జలమండలిలో చర్చ సాగుతోంది.

>
మరిన్ని వార్తలు