గ్రేటర్‌పై కాంగ్రెస్‌ గురి.. రంగంలోకి దీపా దాస్‌మున్షీ

17 Jan, 2024 07:30 IST|Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నాలుగింటిలో కనీసం మూడింటిని దక్కించుకునేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ రంగంలోకి దిగారు. మంగళవారం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మైనారిటీ వర్గాలతో సమావేశం నిర్వహించి చర్చించారు. కాగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించిన కారణంగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్తలకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టీపీసీసీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ) పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను కూడా నియమించింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలకు రెండేసి నియోజకవర్గాల బాధ్యతలను, మిగిలిన వారికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డి గ్రేటర్‌ పరిధిలోని చేవెళ్ల స్థానంతో పాటు మరో నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్‌, హైదరాబా ద్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా నియమించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించారు,.

ప్రతిష్టాత్మకమే..
గ్రేటర్‌ పరిధిలోని పార్లమెంట్‌ నియోజకవర్గాలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తం నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మూడింటిలో పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. వాస్తవంగా నాలుగు నియోజకవర్గాల్లోని మొత్తం 29 అసెంబ్లీ సెగ్మెంట్లలకు కేవలం మూడింటిలో మాత్రమే కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం ఉండగా, మిగతా సెగ్మెంట్లకు బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో గోషామహల్‌ (బీజేపీ) మినహా మిగతా వాటిలో మజ్లిస్‌ ప్రాతనిధ్యం కలిగి ఉంది. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం ఉండగా, చేవెళ్ల పరిధిలో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం ఉంది. మిగతా సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం కలిగి ఉంది. అయితే అధికార కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ప్రభంజనంలో.. పరాభావం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం కొనసాగినా... మహానగర పరిధిలోని అన్ని స్థానాల్లో పరాభావం తప్పలేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం గత పదేళ్లుగా అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభావానికి గురవుతూ వస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం నిరాశ పర్చాయి. లోక్‌సభ స్థానాల వారీగా పరిశీలిస్తే వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంటల్లో సైతం ఓటు సాధించడంలో పూర్తిగా వెనుకబడింది. పలు సెగ్మెంటల్లో మూడో స్థానానికి పరిమితమైంది.

పార్టీ వీడిన వారికి పచ్చజెండా..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్‌తో రాబోవు పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలిగింటిలో మూడింటిని క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. తాజాగా.. గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకొని లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో ఎంబీటీ చేరితే దానికి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం వదిలి మిగతా స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకోసం సీనియర్‌ నాయకులైన మంత్రులకు ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్‌ స్థానాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పని చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని చర్యలకు ఉపక్రమించింది.

>
మరిన్ని వార్తలు