ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సూచనలు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సూచనలు

Published Wed, Jan 17 2024 5:56 AM

సమీక్ష సమావేశంలో పాల్గొన్న డీజీపీ రవి గుప్తా - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీస్‌ అధికారులకు డీజీపీ రవిగుప్తా మంగళవారం పలు సూచనలు చేశారు. విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు, ట్రాఫిక్‌ సిబ్బందికి ఆధునిక శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ట్రాఫిక్‌ పరిస్థితిపై సీనియర్‌ పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బి.శివధర్‌ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు, హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌, ఐజీ తరుణ్‌ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త స్కైవాక్‌లు, ఫ్లైఓవర్‌ల చుట్టూ ట్రాఫిక్‌ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మూసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వివరించారు. సిఫార్సుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement