అసెంబ్లీ  స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌

14 Dec, 2023 07:43 IST|Sakshi
గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తరఫున అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు. చిత్రంలో భట్టి విక్రమార్క, తుమ్మల, కేటీఆర్, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు

బీజేపీ మినహా  అన్ని పక్షాలు మద్దతు

బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసుకు శ్రీధర్‌బాబు

సీఎం రేవంత్‌తో కలిసి వెళ్లిన కేటీఆర్

నేడు కొత్త స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి బుధవారం ప్రసాద్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.  గురువారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ నూతన స్పీకర్‌ పేరును అధికారికంగా ప్రకటిస్తారు.

అనంతరం ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌ స్థానం వద్దకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు వివిధ పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని వెళతారు. ఆపై నూతన స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి అధికారపక్షం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌ పత్రాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

అయితే స్పీకర్‌ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేరును కాంగ్రెస్‌ ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి  గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు.

కాంగ్రెస్‌ నుంచి అందిన వినతి మేరకు స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్యలు సంతకాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నుంచి కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌ తదితరులు జట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు ప్రసాద్‌ కుమార్‌ తరపున నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

 తెలంగాణ తొలి శాసనసభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్‌గా పనిచేయగా, రెండో శాసనసభలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రస్తుత మూడో శాసనసభలో దళిత సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

>
మరిన్ని వార్తలు