మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..

28 May, 2022 10:21 IST|Sakshi

 2021లో 26 శాతం పెరిగిన మహిళా సీఈవోల వేతనం

కార్పొరేట్‌ ర్యాంకులు, స్త్రీ, పురుషల మధ్య వేతన వ్యత్యాసం ఇంకా ఉంది: ఈక్విలర్‌ సర్వే

న్యూయార్క్‌: ఎస్‌అండ్‌పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్‌ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్‌ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్‌ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది.

‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్‌ ఫెర్నీ సీఈవో జేన్‌ స్టెవెన్సన్‌ పేర్కొన్నారు. ఎస్‌అండ్‌పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్‌అండ్‌పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.   
   
 

>
మరిన్ని వార్తలు