Future Of Gaming Market: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్‌ గేమింగ్‌ మార్కెట్‌ ఎంతంటే..

3 Nov, 2023 10:41 IST|Sakshi

రూ.62వేల కోట్లు ఉంటుందని అంచనా

దేశంలో మొత్తం ఆన్‌లైన్‌ గేమర్లు 56 కోట్లమంది 

ఏటా పెరుగుతున్న రియల్‌మనీ గేమింగ్‌ పరిశ్రమ

‘ఎప్పుడు చూసినా మొబైల్‌లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్‌ గేమ్స్‌ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్‌లైన్‌ గేముల ప్రత్యేకత. డిజిటల్‌ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. 

భారత్‌లోని డిజిటల్‌ గేమింగ్‌ మార్కెట్‌ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్‌ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో 15వ ఇండియా గేమ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్‌ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్‌ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్‌ గేమింగ్‌ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్‌ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్‌ ఆఫ్‌ ఇండియా గేమింగ్‌ రిపోర్ట్‌ 2023’ నివేదికను విడుదల చేసింది. 

ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్‌

నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం డిజిటల్‌ గేమ్‌లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌ గేమింగ్‌ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్‌ మనీ గేమింగ్‌ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్‌ గేమ్‌లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్‌లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్‌ డౌన్‌లోడ్లతో భారత గేమింగ్‌ రంగం అంతర్జాతీయ గేమింగ్‌ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

మరిన్ని వార్తలు