Antimicrobial Resistance: యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌తో ముప్పు

20 Nov, 2023 05:14 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 50 లక్షల మంది 

2050 నాటికి మృతుల సంఖ్య కోటికి పెరిగే అవకాశం 

దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడి  

ఆక్స్‌ఫర్డ్‌(యూకే):   కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పారాసైట్లు, ఫంగస్‌ వంటివి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటిని మైక్రోబ్స్‌ అని పిలుస్తుంటారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కొన్ని రకాల జీవ క్రియలకు మైక్రోబ్స్‌ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి బ్యాక్టీరియా, వైరస్‌లు తోడ్పడుతుంటాయి.

వ్యవసాయం, పరిశ్రమల్లోనూ వీటి ప్రాధాన్యం ఎక్కువే. అయితే, ఈ మైక్రోబ్స్‌ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో కీడు చేస్తుంటాయి. అనారోగ్యం కలిగిస్తుంటాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్‌ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి మైక్రోబ్స్‌ను అంతం చేయడం లేదా వాటిని వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. కాలానుగుణంగా మైక్రోబ్స్‌ ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అంటే టీకాలను లొంగకుండా తయారవుతాయి.

అంతిమంగా ‘సూపర్‌బగ్స్‌’గా మారుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు ప్రయోగించిన ఫలితం ఉండదు. ఈ పరిణామాన్ని యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) అంటారు. ఈ ఏఎంఆర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని తాజాగా దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడయ్యింది. హెచ్‌ఐవీ/ఎయిర్స్, మలేరియా సంబంధిత మరణాల కంటే ఇవి చాలా అధికం. ఏఎంఆర్‌తో ఏటా మృత్యువాత పడే వారి సంఖ్య 2050 నాటికి ఏకంగా కోటికి చేరుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్‌ సంబంధిత మరణాలను కూడా త్వరలో ఏఎంఆర్‌ మరణాలు అధిగమిస్తాయని అంటున్నారు.  

► ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్స్‌ వాడకం మితిమీరుతోంది.  
► 2000 నుంచి 2015 మధ్య ఇది 65 శాతం పెరిగిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  
► మొత్తం యాంటీ మైక్రోబియల్స్‌ 73 శాతం ఔషధాలను ఆహారం కోసం పెంచే జంతువులపైనే ఉపయోగిస్తున్నట్లు తేలింది.  
► ఇలాంటి జంతువులను భుజిస్తే మనుషుల్లోనూ మైక్రోబ్స్‌ బలోపేతం అవుతున్నాయని, ఔషధాలకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు.  
► యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ అనేది కేవలం కొన్ని దేశాల సమస్య కాదని, ఇది ప్రపంచ సమస్య అని నిపుణులు చెబుతున్నారు.  
► దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్‌పై అధారపడడాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు