Israel-Hamas war: అల్‌–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు

20 Nov, 2023 04:22 IST|Sakshi
అల్‌ షిఫా ఆస్పత్రి నుంచి తరలించిన అనంతరం రఫాలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

ఈజిప్టుకు తరలించి, మెరుగైన చికిత్స అందిస్తాం: గాజా ఆరోగ్య శాఖ

బందీల విడుదలకు హమాస్‌తో ఖతార్‌ ప్రతినిధుల చర్చలు  

ఖాన్‌ యూనిస్‌: అల్‌–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్‌ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్‌ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్‌–షిఫా హాస్పిటల్‌ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు.

వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్‌–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్‌ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్‌–షిఫా నుంచి అంబులెన్స్‌ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ చెప్పారు.  
 
జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం   
గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్‌–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది.

హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు.  

బందీల విడుదలకు యత్నాలు  
గాజాలో హమాస్‌ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్‌ అల్‌–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్‌ గల్ఫ్‌ దేశమైన ఖతార్‌ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్‌ ప్రతినిధులు హమాస్‌ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు