మాతృభాషకు అసలైన గౌరవం... ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా..ఎల్లప్పుడూ కన్నడిగే!

20 May, 2022 15:34 IST|Sakshi

మాతృభాష కనుమరుగైపోతుంది.. మాతృభాషలో మాట్లాడాలి..  ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను విస్మరించవద్దు.. అంటూ రకరకాల స్పీచ్‌లతో హోరెత్తించడం చూశాం.  కేవలం మాతృభాష దినోత్సవం రోజున మాత్రమే ఈ మాతృభాష మీద ప్రేమ ఉప్పొంగుతుందే తప్ప తర్వాత షరా మాములే. కానీ ఒక కెనడా ఎంపీ పార్లమెంట్‌లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించి ఔరా అనిపించుకున్నాడు. అంతేకాదు మాతృభాషకు ఇ‍వ్వాల్సిన గౌరవం ఇది అని గొంతెత్తి చెప్పాడు.

వివరాల్లోకెళ్తే....కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంట్‌లో కన్నడలో మాట్లాడి పలువురి హృదయాలను గెలుచుకున్నారు. ఈ మేరకు ఆయన కెనడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ...భారతదేశం వెలుపల ప్రపంచంలోని ఏ పార్లమెంట్‌లోనైనా కన్నడ మాట్లాడటం ఇదే మొదటిసారి. కెనడా పార్లమెంట్‌లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించటం చాలా ఆనందంగా ఉంది. ఐదు కోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణం. అని చెప్పారు.

అంతేకాదు కవి కువెంపు వ్రాసిన గీతాన్ని స్వరపరిచిన డాక్టర్ రాజ్‌కుమార్ పాటలోని “ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగే” అంటూ ఆయన ఆ ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య కెనడా పార్లమెంట్‌కి 2015లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2019లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సిఎన్ అశ్వత్నారయ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. నెటిజన్లు ఫైర్‌.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు