ముంబైలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. కుప్పకూలిన అయిదు ఇళ్లు

29 Nov, 2023 11:13 IST|Sakshi

మహారాష్ట్ర రాజధానిలో ముంబైలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అయిదు ఇళ్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైన సందులో ఉండటంతో శిథిలాల కింద అనేకమంది నివాసితులు చిక్కుకుపోయారు. 

గోల్ఫ్‌ క్లబ్‌ సమీపంలోని ఓల్డ్‌ బారక్‌లో ఉదయం 8 గంటలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి నాలుగైదు అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. ధ్వంసమైన ఇళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మెట్లు సగం కూలిపోయి, బాల్కనీలు గాలిలో వేలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రమాద తీవ్రత కళ్లకు అద్దం పడుతోంది. 

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు భవనాల శిథిలాల నుంచి 11 మందిని రక్షించారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అగ్నిమాపక దళం, పోలీసులు మరియు అంబులెన్స్ సేవలు ప్రమాద స్థలంలో ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా రెండు వారాల క్రితం ముబైలోని బాంద్రాలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు జరిగి ఎనిమిది మంది గాయపడిన విషయం విదితమే. గాయపడిన వారిలో చాలా మందికి 35 నుండి 40 శాతం వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ముంబై అగ్నిమాపక దళం అధికారులు తెలిపారు.
చదవండి: ఎంత ఘోరం.. గాజు డోర్‌ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి

మరిన్ని వార్తలు