చైనా ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్లకు పైలట్ల కొరత

2 Oct, 2022 05:22 IST|Sakshi

బీజింగ్‌: ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్ల (విమానవాహక నౌకల)పై నుంచి యుద్ధ విమానాలను నడపడంలో సుశిక్షితులైన పైలట్లు దొరక్క డ్రాగన్‌ దేశం తంటాలు పడుతోంది. విమానవాహక నౌకల కోసం తయారు చేసిన యుద్ధ విమానాలు ముఖ్యంగా జె–15 జెట్లు నడిపే అర్హులైన పైలట్ల డిమాండ్‌ను తీర్చేందుకు చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీ (పీఎల్‌ఏఎన్‌) శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

మొదటి విమాన వాహక నౌక లియోనింగ్‌ను ప్రారంభించిన దశాబ్దం తర్వాత చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని చైనా మిలటరీ మేగజీన్‌ ఆర్డినెన్స్‌ ఇండస్ట్రీ సైన్స్‌ టెక్నాలజీ తాజా కథనంలో తెలిపింది. గత వారం సముద్రంలో ట్రయల్స్‌ ప్రారంభించిన అత్యాధునిక మూడో విమాన వాహక నౌక ఫుజియాన్‌పై ఉండే 130 యుద్ధ విమానాలను నడిపేందుకు కనీసం 200 మంది క్వాలిఫైడ్‌ పైలట్లు అవసరం ఏర్పడిందని అందులో తెలిపింది. అంతేకాదు, అమెరికాతో సరితూగగల ఇలాంటి మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను తయారు చేసుకోవాలని చైనా ప్రణాళికలు వేస్తోంది.

‘అయితే, విమానాల డిజైనింగ్‌తోపాటు అందుకు తగ్గట్లుగా పైలట్లను తయారు చేసుకోవడం చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కీలక సాంకేతిక అంశాలను మీతో ఎవరూ పంచుకోరు. ఎవరికి వారు వీటిని సొంతంగా సమకూర్చుకోవాల్సిందే’ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా కనీసం ప్రతి రెండు నెలలకో యుద్ధ నౌకను రంగంలోకి దించుతూ తన నావికాశక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. పైలట్ల కొరతను అధిగమించేందుకు నేవీ అధికారులు ఎయిర్‌ఫోర్స్‌లోని అర్హులైన సిబ్బందికి బదులు హైస్కూల్‌ విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల వారిని ఎంపిక చేస్తూ శిక్షణను వేగవంతం చేసినట్లు అధికార చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ తెలిపింది. పలు సాంకేతిక అంశాల్లో అమెరికాతో పోలిస్తే చైనా పైలట్లు శిక్షణలో వెనుకబడినట్లే భావించాల్సి ఉంటుందని ఆర్డ్‌నెన్స్‌ ఇండస్ట్రీ సైన్స్‌ టెక్నాలజీ పత్రిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు