‘ఆకాశ ఎయిర్‌’లో ఏం జరుగుతోంది?,పెలెట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం

17 Sep, 2023 09:09 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్‌’ సంచలన నిర్ణయం తీసుకుంది. నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుండా సంస‍్థ నుంచి వైదొలగిన 43 మంది పైలెట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

పైలెట్లు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ప్రాంతాలకు సర్వీసులు అందించే ఆకాశ ఎయిర విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అధిక సంఖ్యలో విమానాల సేవల్ని రద్దు చేసింది. పైలెట్ల కొరతే విమానయాన సేవలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

బాంబే హైకోర్టుకు 
ఈ నేపథ్యంలో సంస్థకు రాజీనామా చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా 6 నెలల పాటు నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మరో సంస్థలో చేరిన పైలెట్లపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

తమ సంస్థతో పైలెట్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మరో సంస్థలో చేరే ముందు పైలెట్లు నోటీస్‌ సర్వ్‌ చేయాలి. కానీ అలా చేయకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించింది. కాబట్టి సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల తామెంతో నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరింది.  

పైలెట్లది అనైతిక, స్వార్థపూరిత చర్య
ఈ సందర్భంగా విమానయాన చట్టం ప్రకారం.. ఉద్యోగులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించారని ఆకాశ ఎయిర్‌ ప్రతినిధి తెలిపారు.‘ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పైలెట్ల అనైతిక, స్వార్థపూరిత చర్య కారణంగా ఈ ఆగస్టులో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. పైలెట్ల కొరత కారణంగా చివరి నిమిషంలో విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. కాగా, ప్రస్తుతం 20 విమానాల సేవల్ని అందిస్తున్న ఆకాశా ఎయిర్‌ గత ఏడాది ఆగస్టు నెలలో కార్యకలాపాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

చదవండి👉 భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ వేతనాలు.. కెప్టెన్‌ నెల శాలరీ ఎంతంటే?

మరిన్ని వార్తలు