రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్‌!

13 Sep, 2020 13:00 IST|Sakshi
దోమల దాడిలో బలైన జంతువులు

లూసియానా : రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, అడవి వన్య ప్రాణుల్ని బలితీసుకుంది. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల ఆగస్టు 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తం పీల్చి చంపేశాయి. దాదాపు లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొంతమంది హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు.

ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు
దీంతో దోమల ఉధృతి కొద్దిగా తగ్గింది. ఈ దోమల దాడిలో దాదాపు 400 పాడి జంతువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. సెప్టెంబర్‌ 2న ఓ వ్యక్తి తీసిన ఫొటో ఒకటి రాకాసి దోమల రక్త పిపాసకు అద్దం పడుతోంది. చనిపోయిన ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దాని రక్తం పీలుస్తున్న ఫొటో అది.    

మరిన్ని వార్తలు