కరోనా మరణాలు: భారత్‌ లెక్క ఐదున్నర లక్షలు.. డబ్ల్యూహెచ్‌వో లెక్క 47 లక్షలకుపైనే!

6 May, 2022 05:26 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. అయితే సంస్థ ప్రకటనను భారత్‌ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తమ లెక్కల ప్రకారం ప్రపంచంలో జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్‌ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే ఈ సంఖ్య 1.49 కోట్లని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ చెబుతున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వాలకు ఆరోగ్యవ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ లెక్కలో కరోనా సోకి చనిపోయినవారితో పాటు ఆరోగ్యవ్యవస్థ, సమాజంపై కరోనా ప్రభావం వల్ల మరణించినవారు కూడా ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

ఈ పరోక్ష మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికమని సంస్థ తెలిపింది. భారత్‌లో ఈ లెక్క 47, 40,894 పైనే ఉంటుందని సంస్థ ప్రకటించింది. తమ గణాంకాలు భారత అధికారిక గణాంకాలతో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాల లెక్కింపు కోసం వాడిన పద్ధతులు సరైనవి కావని, ఈ లెక్కపై తమ అభ్యంతరాలను సంస్థకు తెలియజేస్తామని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో కేంద్రం వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య 5, 23, 000 కు పైనే ఉంది. అంటే.. డబ్ల్యూహెచ్‌వో ఇస్తున్న గణాంకాలు అధికారిక గణాంకాల కంటే పది రెట్లు దాకా ఎక్కువన్నమాట. 

కరోనానే కారణం కాదు!
భారత దేశంలో అధికారికంగా 2019లో 76.4 లక్షల మరణాలు(అన్నిరకాల మరణాలు) రికార్డు కాగా, 2020లో 6.2 శాతం పెరిగి 81.2 లక్షలకు చేరాయి. ఈ పెరుగుదలకు కేవలం కరోనా మాత్రమే కారణం కాదని నీతిఆయోగ్‌ సభ్యుడు పాల్‌ చెప్తున్నారు. ఇక మన అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2020లో భారత్‌లో లక్షన్నర కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కానీ  ప్రపంచ కోవిడ్‌ మరణాల్లో.. మూడింట ఒకవంతు భారత్‌లో సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో సంస్థ గణాంకాలు చూపుతున్నాయి.

మరిన్ని వార్తలు