‘లేడీ’ లేడీతో ఢీ అంటోన్న ఫొటో వైరల్‌

15 Oct, 2020 18:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నీలి రంగు గౌను ధరించిన పడుచమ్మాయి ఇటీవల లండన్‌లోని రిచ్‌మండ్‌ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎండు గడ్డిలో గంతులేస్తోన్న జింకను చూసి ముచ్చటపడ్డారు. సోషల్‌ మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ కోసం ఓ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అది మీదకు దూసుకురావడంతో ఆ అమ్మాయి హఠాత్తుగా వెనుతిరిగారు. ఆమెకు సెల్ఫీ ముచ్చట తీరిందో, లేదోగానీ ఈ దశ్యాన్ని మాత్రం ఫొటో తీసిన రాయల్‌ పార్క్‌ పోలీసులు దాన్ని అక్టోబర్‌ 11వ తేదీన పోస్ట్‌ చేశారు.

‘పార్క్‌లో తిరుగుతున్న ఆ జింక ‘డిస్నీ’ సిరీస్‌లోని బాంబి క్యారెక్టర్‌ లాంటిది కాదు. పైగా దానికి ఇప్పుడు ‘మేటింగ్‌ సీజన్‌’. అది క్రూరంగా దాడి చేస్తుంది. కనుక జింకలకు కనీసం 50 మీటర్లు దూరంగా ఉండండి’ అంటూ రాయల్‌ పార్క్‌ పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ ఫొటో కింద హెచ్చరికను చూసే చూసినవారంతా నవ్వుకుంటున్నారు.

జింక ఫోజు చూస్తే దాడి చేస్తున్నట్లు లేదు. ఆ కళ్లలో క్రూరత్వం అసలు కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఫొటోను చూస్తుంటే భయపడి పోయి బిక్క చచ్చి పోయినట్లు కనిపించడం లేదు. సరదాగే అలా ఫోజించినట్లు కనిపిస్తోంది.. అంటూ సోషల్‌ మీడియా యూజర్లు వ్యాఖ్యానాలతోపాటు ఉద్దేశపూర్వకంగానే రాయల్‌ పార్క్‌ పోలీసులు అలా ఫోటో తీశారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు