ఖగోళంలో రాకాసి బిలం గుర్తింపు.. ఒక్క సెకనులో భూమినే మింగిపడేస్తుందట!

18 Jun, 2022 20:49 IST|Sakshi

ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఉంది.. ఒక్క బ్లాక్‌హోల్‌(కృష్ణ బిలం)కే. స్పేస్‌టైమ్ ప్రాంతంగా పేరున్న బ్లాక్‌ హోల్‌ నుంచి.. ఏ కణమూ, చివరికి కాంతి లాంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏవీ తప్పించుకోలేవు. అలాంటిది భూమి లాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి ఉంటే.. ?.. 

ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్‌హోల్‌ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు. పైగా సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్నదిగా భావిస్తున్న ఆ బ్లాక్‌హోల్‌ సైజు కూడా జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది. అది ఎంతలా అంటే.. సెకనులోనే భూమి సైజు ఉన్నంత పరిణామాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్‌ హోల్స్‌తో ఈ భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు!. 

స్కై మ్యాపర్‌ అనే టెలిస్కోప్‌ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్‌’ను గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్‌ హోల్‌ను కనిపెట్టారు. 

పాలపుంత కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్‌ హోల్‌ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్‌ క్రిస్టోఫర్‌ ఆన్‌కెన్‌. 

► శక్తివంతంగా.. ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్‌ హోల్‌ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్‌ ఈ బ్లాక్‌హోల్‌లోకి ప్రవేశించి సైజును పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. 

► యాభై ఏళ్లకొకసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ.. ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. 

► మూడు బిలియన్ల సూర్యులు కలిస్తే ఎంత సైజు ఉంటుందో ఈ బ్లాక్‌ హోల్‌ సైజు అంతగా ఉందట!. పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. ఆర్‌ఎక్స్‌ఐవీ డేటాబేస్‌లో ఈ పరిశోధనను పొందుపరచగా.. ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ఈ కథనం పబ్లిష్‌ చేశారు.

► 14.5 విజువల్‌ మాగ్నిట్యూడ్‌ ఉన్న టెలిస్కోప్‌తో ఈ భారీ బ్లాక్‌ హోల్‌ను ఎవరైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

చదవండి: అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్‌.. ఇది రెండోసారి

మరిన్ని వార్తలు