Bedbug Crisis in Paris: ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్‌!

7 Oct, 2023 07:18 IST|Sakshi

నల్లులు  జాతీయ సమస్యగా మారనున్నాయా? అని ఫ్రెంచి వారిని అడిగితే ‘అవును’ అనే సమాధానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పారిస్ బెడ్‌బగ్స్ (నల్లులు)తో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇక్కడి మెట్రో, విమానాశ్రయం, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా ప్రతిచోటా నల్లులు నక్కి ఉంటున్నాయి.

పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నల్లులను ప్రజలంతా తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రులంతా దీనిపై హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. 

ఫ్రాన్స్ 2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో విదేశీ ఆటగాళ్లు నల్లులకు బలికాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. రాజధాని ప్యారిస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నల్లుల బెడద సోకింది. పొంచివున్న ప్రమాదం నుంచి ఇక్కడివారు ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. ఆయన ఒక పత్రికా ప్రకటనలో  ప్రజలనుఉద్దేశించి ‘మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు. అవి మిమ్మల్ని తాకినప్పుడు, అవి మీతో పాటు మీ ఇంటికి వస్తాయి’ అని హెచ్చరించారు.

అలాగే గ్రెగోయిర్ ఫ్రాన్స్ స్టేట్ రేడియో సర్వీస్ ‘ఫ్రాన్స్ ఇన్ఫో’తో మాట్లాడుతూ ‘నల్లుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సను బీమా పాలసీలో చేర్చాలి. ఇది బెడ్‌బగ్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని’ ఆయన మీడియాకు తెలిపారు.

మూడేళ్ల కిందట కూడా ఇదేవిధంగా నలుల్ల బెడద దాపురించింది. వెంటనే స్పందించిన ఫ్రెంచ్ ప్రభుత్వం తన ప్రత్యేక వెబ్‌సైట్, సమాచార హాట్‌లైన్‌ సాయంతో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల మెట్రోలో బెడ్‌బగ్‌లు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారు. పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ కూడా రాశారు.

1950లో ఫ్రాన్స్‌లో ఇదే విధమైన నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు