Illegal betting: చట్ట విరుద్ధంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌

21 Oct, 2023 01:30 IST|Sakshi

ఏటా రూ.2 లక్షల కోట్ల పన్ను నష్టం

కొత్త విధానాన్ని కఠినంగా అమలు చేయాలి

థింక్‌ ఫర్‌ చేంజ్‌ నివేదిక సూచన

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ 2023 జోరుగా సాగుతుండడంతో, మరోవైపు చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ కార్యకలాపాలు కూడా ఉపందుకుంటున్నాయి. అనధికారిక మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్‌ కార్యకలాపాలు నడుస్తున్నట్టు, ఈ రూపేణా ఏటా రూ.2లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని భారత్‌ కోల్పోతున్నట్టు ‘థింక్‌ చేంజ్‌ ఫోరమ్‌’ (టీసీఎఫ్‌) నివేదిక తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడిచే క్రీడల బెట్టింగ్‌ మార్కెట్‌లోకి భారత్‌ నుంచి ఏటా రూ.8,20,000 కోట్లు వస్తున్నట్టు ఈ ఫోరమ్‌ అంచనా వేసింది.

ప్రస్తుత జీఎస్‌టీ రేటు 28 శాతం ప్రకారం చూస్తే ఈ మొత్తంపై భారత్‌ ఏటా రూ.2,29,600 కోట్లు నష్టపోతున్నట్టు తెలిపింది. ఈ తరహా చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ కార్యకలాపాల నిరోధానికి నూతన జీఎస్‌టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌ సంస్థల కార్యకలాపాలను గుర్తించేందుకు, అవి భారత్‌లో రిజిస్టర్‌ చేసుకునేలా చూసేందుకు టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తద్వారా భారత్‌ నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ కోసం నిధులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది.  

లేకుంటే మరింత నష్టం
ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు లేకుంటే మరింత ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. నూతన జీఎస్‌టీ విధానంతో చట్టపరిధిలో పనిచేసే గేమింగ్‌ మార్కెట్‌ బదులుగా చట్ట విరుద్ధంగా పనిచేసే ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌ కంపెనీలు ఎక్కువ వృద్ధిని చూడనున్నాయని, ఫలితంగా మరింత పన్ను నష్టం ఏర్పడుతుందని వివరించింది. ఐపీఎల్‌ సమయంలోనూ పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ కార్యకలాపాలు కొనసాగడాన్ని ప్రస్తావించింది.

మన దేశంలో బెట్టింగ్, గేమింగ్‌పై 14 కోట్ల మంది సాధారణంగా పాల్గొంటూ ఉంటారని, ఐపీఎల్‌ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ లావాదేవీలపై నిషేధం విధించడంతో చట్ట విరుద్ధంగా భారత్‌ లోపల, భారత్‌ నుంచి వెలుపలకు నిధులు తరలింపు కోసం రహస్య పద్ధతులను అనుసరించేందుకు దారితీస్తున్నట్టు వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీలు, అక్రమ చానళ్లు నిధుల తరలింపునకు వీలు కలి్పస్తూ.. భారత్‌ దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నట్టు పేర్కొంది.

ఇలా అక్రమంగా తరలించే నిధులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, జాతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు వనరులుగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ సైట్లు భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటులు, క్రీడాకారులను బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు