పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై రాకెట్ లాంచర్లతో దాడి..

17 Jul, 2023 10:03 IST|Sakshi

ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 

సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు.

సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు.    

ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్.

దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. 

ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం..

మరిన్ని వార్తలు