Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం

19 Nov, 2023 05:11 IST|Sakshi
ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో నేలమట్టమైన జబాలియా శరణార్థి శిబిరంలోని భవనాలు.. శిథిలాల కింద బాధితుల కోసం అన్వేషణ

ఇజ్రాయెల్‌ దాడులు, వందల్లో మృతులు

ఒకే కుటుంబంలో 32 మంది బలి

నివాస భవనంపై దాడిలో 26 మంది

ఖాళీ అవుతున్న అల్‌ షిఫా ఆస్పత్రి

దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులు

అక్కణ్నుంచి పశి్చమానికి వలసలు!

నెట్, ఫోన్‌ సేవల పునరుద్ధరణ

ఖాన్‌ యూనిస్‌ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్‌ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) నడుపుతున్న అల్‌ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు.

గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్‌ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్‌ లాహియాలోని తల్‌ అల్‌ జాతర్‌ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది.

దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్‌ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే.

ఇంధన సరఫరా
తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్‌ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది.

గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్‌ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి.

నోవా ఫెస్ట్‌ మృతులు 364 మంది
ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్‌ 7 నాటి హమాస్‌ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను హమాస్‌ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్‌ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది.

పులి మీద పుట్రలా...
ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్‌ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్‌ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. 

మరిన్ని వార్తలు