Israel-Hamas War Updates: అదే గాజా.. అదే దీన గాథ!

14 Nov, 2023 05:19 IST|Sakshi
గాజాలోని షిఫా ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి ఇది. నెలలు నిండకుండానే జన్మించిన శిశువులను ఇంకు్యబేటర్‌కు బదులు ఇలా సిల్వర్‌ ఫాయిల్‌ను చుట్టబెట్టిన బెడ్‌లో ఉంచి కాపాడుతున్నారు.

గాజా ఆస్పత్రుల్లో మరణమృదంగం

దెయిర్‌ అల్‌ బలాహా/ఖాన్‌ యూనిస్‌ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్‌ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి.

ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్‌ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్‌ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనోం గేబ్రెయేసస్‌ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు.

చిన్నారులను కాపాడేందుకు...
ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్‌ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్‌ ఫాయిల్‌ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంధన రగడ
ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్‌ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్‌ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్‌ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది.  

అల్‌ రంటిసి, అల్‌ నస్ర్‌
ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది.

అల్‌ స్వెయిదీ
లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్‌ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్‌ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు.

అల్‌ షిఫా
700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

అల్‌ ఖుద్స్‌
గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అల్‌ అక్సా
ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది.

మరిన్ని వార్తలు