Gilles Devers: పాలస్తీనియన్లకు ఫ్రాన్స్‌ న్యాయవాది భరోసా!

14 Nov, 2023 10:17 IST|Sakshi

ఇజ్రాయెల్‌- పాలస్తీనాకు చెందిన హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో  ఓ ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పేందుకు తాము అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది గిల్లెస్‌ డెవర్స్‌ ప్రకటించారు. అంతేకాదు.. ఈ న్యాయయుద్ధం కోసం ఆయన కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు న్యాయవాదులతో ఒక బృందాన్నీ ఏర్పాటు చేశారు. 

గత నెల ఏడవ తేదీన హమాస్‌ ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేయడంతో మొదలైన యుద్ధం ఆ తరువాత మరింత తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ వైమానిక, పదాతి దళాలతో గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ఆస్తినష్టమూ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ యుద్ధంలో తప్పు ఎవరిదన్నవిషయంలో ప్రపంచం రెండుగా విడిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించే లక్ష్యంతో తాము దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ చెబుతూండగా.. హమాస్‌ పేరుతో తమ ప్రాణాలు పొట్టన బెట్టుకుంటున్నారని పాలస్తీనీయులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులు, ఆంబులెన్సులపై దాడులు చేస్తూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌ న్యాయవాది గిల్లెస్‌ డెవర్స్‌ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం, అంతర్జాతీయ న్యాయాలయాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కేసులు వేస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్లెస్‌ డెవర్స్‌ తన ప్రయత్నాలను వివరిస్తూ ఇటీవల ఒక ట్వీట్‌ చేశారు. అందులో పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘మిమ్మల్ని రక్షించడానికి, జాతీయ, అంతర్జాతీయ కోర్టుల ద్వారా న్యాయం అందించేందుకు తమ న్యాయ సైన్యం సిద్ధంగా ఉందని’ గిల్లెస్‌ ప్రకటించారు. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెట్‌ భవిష్యత్తు అంధకారం కావడం గ్యారెంటీ అని ఆయన ధీమాగా చెబుతున్నారు. 


ఇది కూడా చదవండి: గాజాపై హమాస్‌ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్‌
 

మరిన్ని వార్తలు