Temple Vandalised: భారత్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌

23 Dec, 2023 15:19 IST|Sakshi

అమెరికాలోని స్వామినారాయణ్‌ మందిర్‌ గోడలపై విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదుల ఆగడాలకు ఎట్టిపరిస్థితుల్లో చోటు ఇవ్వమని అ‍న్నారు.  శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌.. ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూఎస్‌ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మందిర్‌ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తాను చూసినట్లు జైశంకర్‌ మీడియాకు తెలిపారు.

ఇటువంటి ఘటనలకు పాల్పడే.. తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఈ ఘటన భారతీయుల మనోభావలను కించపరిచింది. వెంటనే దర్యాప్తు చేయాలని  ఫిర్యాదు చేశాం. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యూఎస్‌ అధికారులకు విజ్ఞప్తి చేశాం’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

స్వామినారాయణ్‌ మందిర్‌ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్‌ సింగ్‌ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది విద్వేశాలు రెచ్చగొట్టే చర్యల కిందకి వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఎక్స్‌ ట్వీటర్‌లో కోరింది.

చదవండి: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు

>
మరిన్ని వార్తలు