అవి హిట్లర్‌ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్‌

23 Dec, 2023 08:14 IST|Sakshi

వాషింగ్టన్‌: అక్రమ  వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్‌ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ తన పుస్తకం ‘మెయిన్‌ కంఫ్‌’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్‌ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్‌ ద బ్లడ్‌ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు.

పాయిజనింగ్‌ ద బ్లడ్‌ వ్యాఖ్యల వెనుక హిట్లర్‌ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్‌ గురించి ఏమీ తెలియదు. హిట్లర్‌ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్‌ కొట్టిపారేశారు.

నేషనల్‌ పల్స్‌ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్‌ పాయిజనింగ్‌ ద బ్లడ్‌ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్‌లో న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.

ఆ తర్వాత ఇవి హిట్లర్‌ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్‌ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్‌ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్‌ ఫేవరెట్‌గా మారారు. 

ఇదీచదవండి..ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు

>
మరిన్ని వార్తలు