జూలై 4 కల్లా అమెరికాలో సాధారణ స్థితి

13 Mar, 2021 03:56 IST|Sakshi

అధ్యక్షుడు జో బైడెన్‌ ఆశాభావం

మే 1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సిన్‌

100 రోజుల్లో 100 మిలియన్ల టీకాలే లక్ష్యం

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4 నాటికి కోవిడ్‌ మహమ్మారి నుంచి దేశం విముక్తి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజుకల్లా అమెరికా సాధారణ స్థితికి చేరుకోవాలని జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని వయోజనులందరూ మే 1 నుంచి కోవిడ్‌ వ్యాక్సిన్‌కి అర్హులని ఆయన ప్రకటించారు. జనవరి 20 న అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత జో బైడెన్‌ తొలిసారి చేసిన ప్రైమ్‌ టైమ్‌ ప్రసంగంలో దేశాన్ని కోవిడ్‌ రహితంగా మార్చేందుకు ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగానే మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు.

అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన 1.9 ట్రిలియన్‌ డాలర్ల కరోనా వైరస్‌ రిలీఫ్‌ ప్యాకేజీపై బైడెన్‌ సంతకం చేశారు. ఈ జూలై నాలుగు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం మాత్రమే కాదని, ఇది కరోనా నుంచి విముక్తిదినం కూడానని ప్రకటించారు. కోవిడ్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో మహమ్మారిగా ప్రకటించి ఏడాది అయ్యింది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామని బైడెన్‌ చెప్పారు. అమెరికాలో 527,000 మంది కోవిడ్‌తో మరణించారన్నారు. ఈ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారికన్నా, రెండో ప్రపంచయుద్ధంలో చనిపోయిన వారికన్నా, వియత్నాం వార్‌లో మృత్యువాత పడిన వారికన్నా ఎక్కువని బైడెన్‌ చెప్పారు. 

అధికారం చేపట్టిన తొలి వందరోజుల్లో 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌లను వేయడమే తన లక్ష్యమని బైడెన్‌ చెప్పారు. ‘‘అయితే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, దాన్ని దాటేయబోతున్నాం. వంద రోజులు కాదు, 60 రోజుల్లోనే 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ని అందించనున్నాం’’అని జో బైడెన్‌ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వాధికారులు ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌తయారీదారులతో కలిసి పనిచేస్తూ, ఈ సురక్షితమైన మూడు కంపెనీల నుంచి లక్షలాది వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేస్తోందని చెప్పారు. మే1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సినేషన్, ఎక్కడ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి లాంటి సమాచారం కోసం కొత్త వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ, సురక్షితమైన వాతావరణంలో బడులు తెరవడం ప్రాధామ్యాలని బైడెన్‌ చెప్పారు. పూర్తిస్థాయిలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ అయ్యే వరకు ప్రజలు ఏం చేయాలనే విషయాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తుందని చెప్పారు.  

ఆసియా అమెరికన్లపై దాడులు దుర్మార్గం
కోవిడ్‌ మహమ్మారి కాలంలో ఆసియా ఆమెరికన్ల్ల పై దాడులు ఆపివేయాలని  బైడెన్‌ వ్యాఖ్యానించారు. 2020 మార్చి 19 నుంచి, డిసెంబర్‌ 31 వరకు కోవిడ్‌ సమయంలో 2,800 ఆసియా అమెరికన్ల పట్ల విద్వేష పూరిత ఘటనలు నమోదయ్యాయి. ఇది ఘోరమైన విషయమని, తోటి అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు ముందు వరుసలో ఉండి వారు పోరాడుతున్నారని బైడెన్‌ అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలపట్ల భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఆర్‌ఓ ఖన్నా  హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు