వికీలీక్స్‌ ఫౌండర్‌కు భారీ ఊరట

4 Jan, 2021 17:14 IST|Sakshi

అమెరికాకు అసాంజె అప్పగింత కేసు

అమెరికాకు ఎదురు దెబ్బ

బ్రిటన్‌ కోర్టులో విచారణ 

లండన్‌ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. అసాంజెనే అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్‌ కోర్టు ప్రతికూలంగా స్పందించింది. అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తన తీర్పును ప్రకటించారు. క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా అసాంజె ఆత్మహత్య చేసుకునే ప్రమాదం గణనీయంగా ఉందని తాను నమ్ముతున్నానని, అందుకే అతన్ని అప్పగించలేమని ఆమె వ్యాఖ్యానించారు.

తాజా తీర్పుతో అసాంజే అభిమానులు భారీ సంబరాల్లో మునిగిపోయారు. అలాగే  ప్రపంచవ్యాప్తంగా  హక్కుల సంఘాలు, జర్నలిస్టులు  హర్షం వ్యక్తం చేశాయి. అయితే అమెరికాపై దీనిపై తిరిగి అప్పీల్‌ కు వెళ్లే అవకాశం ఉందని, దీంతో అసాంజే జైల్లోనే ఉండే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఫ్రీడం ఆఫ్ ది ప్రెస్ ఫౌండేషన్  ట్వీట్ చేసింది. మరోవైపు న్యాయమూర్తి తీర్పును స్వాగతించిన పరిశోధనాత్మక పాత్రికేయుడు స్టెఫానియా మౌరిజి స్వేచ్ఛా ప్రసంగం, జర్నలిజానికి మించి అసాంజే పనిచేశాడన్న అమెరికా వాదనలపై  న్యాయమూర్తి  వైఖరిపై అసంతృప్తి వ్యక‍్తం చేశారు. 

కాగా 2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్‌ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్‌, అఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్‌  ఆధారాలతో  బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు. 
 

మరిన్ని వార్తలు