Pakistan: పాక్‌లో 24 గంటల పాటు‘ఎక్స్‌’ బంద్‌.. ‘నెట్‌ బ్లాక్స్‌’ వెల్లడి!

19 Feb, 2024 11:29 IST|Sakshi

ఇటీవలే పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపించాయి. పలు పార్టీలు ఇవి రిగ్గింగ్ ఫలితాలని ఆరోపణలు చేశాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ ‘ఎక్స్’ ను పాకిస్తాన్‌లో 24 గంటల పాటు నిలిపి వేశారనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

పాకిస్తాన్‌లో స్థానిక అధికారులు ఎన్నికల్లో అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ను 24 గంటలు నిలిపివేశారని ఇంటర్నెట్ మానిటర్ నెట్‌బ్లాక్స్ ఆరోపించింది. తొలిసారిగా ‘ఎక్స్‌’పై ఇంత కాలం నిషేధం కొనసాగినట్లు నెట్‌బ్లాక్స్‌పేర్కొంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ప్రధాన న్యాయమూర్తి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పాకిస్తాన్‌లోని రావల్పిండి మాజీ కమిషనర్‌ లియాఖత్‌ అలీ చత్తా ఆరోపించారు. ఈ నేపధ్యంలో వారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు.

మరోవైపు ‘నెట్‌బ్లాక్‌’ దేశవ్యాప్తంగా ‘ఎక్స్‌’కు ఎదురైన అంతరాయాలను నివేదించింది. పలువురు వీపీఎన్‌ల సాయంతో తప్ప ‘ఎక్స్‌’ని యాక్సెస్‌ చేయలేకపోయారని డిజిటల్ హక్కుల పోరాట న్యాయవాద వేదిక ‘బోలో భీ’ డైరెక్టర్ ఉసామా ఖిల్జీ తెలిపారు. పలువురు వినియోగదారులు ‘ఎక్స్’ను వినియోగించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేశారని తెలిపారు. అయితే దీనిపై టెలికాం అథారిటీ లేదా ఐటి మంత్రి నుండి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని ఉసామా ఖిల్జీ పేర్కొన్నారు.  
 

whatsapp channel

మరిన్ని వార్తలు