పైజామా జేబులో బొంగరం | Sakshi
Sakshi News home page

పైజామా జేబులో బొంగరం

Published Mon, Feb 19 2024 4:54 AM

Sakshi Editorial On Jnanpith Award Gulzar

‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’...

గుల్జార్‌ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్‌లో గుల్జార్‌ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్‌ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు.

సిక్కులు కష్టజీవులు. గుల్జార్‌ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్‌ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్‌ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్‌గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్‌. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్‌కు కరెంటు లేని స్టోర్‌రూమ్‌ ఇవ్వబడింది.

ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్‌ పఠనం స్టోర్‌రూమ్‌లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్‌ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్‌ టాగోర్‌’ అంటాడు గుల్జార్‌.

ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్‌కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్‌ సొట్టలుపోయిన కార్లకు పెయింట్‌ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్‌లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్‌ రాయ్‌కు పరిచయం చేశాడు.

‘కార్లకు పెయింట్‌ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్‌ రాయ్‌ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్‌ లైలె’. తర్వాత గుల్జార్‌ హృషీకేశ్‌ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్‌ జైత్రయాత్ర.

గుల్జార్‌ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్  డైరెక్టర్‌... ‘హర్‌ ఫన్  మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్‌. అయితే మన దేశంలో పాప్యులర్‌ కల్చర్‌లో ఉన్న వ్యక్తి సీరియస్‌ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు.

గుల్జార్‌ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్‌ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే  కారణం. చిత్రమేమిటంటే గుల్జార్‌కు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్‌’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు.

‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్‌. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్‌ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్‌పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు.

కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్‌ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్  ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు.  

Advertisement
Advertisement