జాన్‌ ఫోసేకు సాహిత్య నోబెల్‌

6 Oct, 2023 05:01 IST|Sakshi

మాటల్లో చెప్పలేని అంశాలకు గళంగా మారిన రచనలు

నాటక రచయితగా ఎనలేని గుర్తింపు 

సెప్టాలజీ సిరీస్‌కు అత్యంత ప్రజాదరణ

నార్వే రచయిత జాన్‌ ఫోసేకు సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ ఆండర్స్‌ ఓల్సన్‌ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు.

ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్‌ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్‌ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్‌ కమిటీ ఫోన్‌ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్‌ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు.

నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు.  అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

రోజువారీ ఘటనలే కథా వస్తువు
నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్‌ ఫోసే రచనలకు ఆధారం.  అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్‌ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు.

విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్‌ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది.  1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్‌లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది.       

40 భాషల్లో పుస్తకాల అనువాదం
ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్‌ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్‌ జీనియస్‌లలో టాప్‌ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్‌ :సెప్టాలజీ  Vఐ– Vఐఐ’’ షార్ట్‌ లిస్ట్‌లో నిలిచింది. జాన్‌ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి.

ఆరుగురు పిల్లలకు తండ్రి.  64 ఏళ్ల వయసున్న జాన్‌ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్‌ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్‌హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్‌ హౌస్‌లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్‌ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్‌లో ది అదర్‌ నేమ్, ఐ ఈజ్‌ అనదర్, ఏ న్యూనేమ్‌ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి.  

భాషకు పట్టాభిషేకం
జాన్‌ ఫోసే రచనలు నార్వేజియన్‌ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్‌కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు