Brain Eating Amoeba Naegleria Fowleri: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. ఏడాదిలో 11 మంది మృతి!

6 Nov, 2023 07:53 IST|Sakshi

పాకిస్తాన్‌ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలిచే ఈ ఏక కణ జీవి ఇప్పటి వరకు 11 మందిని బలిగొంది. కరాచీలోని సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం.  

మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్‌లోని కరాచీ బఫర్ జోన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు. 

పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్‌ఫెక్షన్ (ఎన్‌ఎఫ్‌ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని ఖలీద్ నియాజ్ కోరారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
 
బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబా ఎలా సోకుతుంది?
బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది.  ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.  అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?

మరిన్ని వార్తలు