హమాస్‌ ఇజ్రాయిల్‌ మధ్య కుదిరిన డీల్‌!

14 Nov, 2023 19:06 IST|Sakshi

టెల్ అవీవ్‌: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ జరగనుందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. హమాస్‌ ఇజ్రాయిల్‌ మధ్య డీల్‌ కుదిరినట్లు సమాచారం. కాల్పుల విరమణ కోసం అంగీకారం దిశగా రెండు వర్గాలు ముందడుగు వేశాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 70 మంది బందీలను విడిచిపెట్టేందుకు హమాస్‌ సిద్ధమైంది. అంతే సంఖ్యలో తమ జైల్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, యువతను విడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ అంగీకరించింది. 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇ‍చ్చినట్లు తెలుస్తోంది.

 
 

గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షించాయి. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ సహా పశ్చిమాసియా దేశాలు మద్దతు తెలిపాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరికలు కూడా చేశాయి. యుద్ధాన్ని సద్దుమణిగించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అధ్యక్షుడు బైడెన్ ఆయా దేశాలతో స్వయంగా చర్చలు జరిపారు. యుద్ధాన్ని నిలిపివేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రస్తుతానికి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య నెలరోజుల నుంచి యుద్ధం నడుస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన హమాస్ రాకెట్ దాడులతో చెలరేగిపోయింది. హమాస్ దాడి నుంచి తేరుకుని ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్.. హమాస్ అంతమే ధ్యేయంగా ముందుకు సాగింది. గాజాలో భూతల యుద్ధం చేసి కీలక హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇన్నిరోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ నుంచి దాదాపు 1400 మంది మరణించారు. గాజాలో 10,000వేలకు పైగా మరణాలు సంభవించాయి.   

ఇదీ చదవండి: అమానవీయం: గాజా ఆస్పత్రిలో 179 మంది సామూహిక ఖననం

మరిన్ని వార్తలు