ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఆందోళనలు

5 Nov, 2023 11:23 IST|Sakshi

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదిలావుండగా పాలస్తీనియన్ మద్దతుదారులు అమెరికాలోని వైట్ హౌస్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

పాలస్తీనియన్ అనుకూలవాదుల నిరసనలతో వాషింగ్టన్ డీసీ నగరంలోని వీధుల్లో రద్దీ నెలకొంది. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు చేతబట్టిన నిరసనకారులలో ఎక్కువగా యువకులు ఉన్నారు. గాజాలో రక్తపాతానికి సూచికగా నిరసనకారులు వైట్ హౌస్ గేట్‌పై ఎరుపు రంగును చల్లారు.

పాలస్తీనా అనుకూల నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు లాఫాయెట్ పార్క్‌లోని జనరల్ మార్క్విస్ డి లఫాయెట్ విగ్రహాన్ని పాలస్తీనా జెండాలతో కప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ జాతి నిర్మూలనకు మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు.

అక్టోబరు 7న గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య మధ్య భీకర యుద్ధం మొదలైంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. అక్టోబరు 7 నుండి జరుగుతున్న యుద్ధంలో 9,400 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..

మరిన్ని వార్తలు