COVID-19 Vaccines: వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత?

5 Apr, 2021 18:45 IST|Sakshi

ఓవైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. మరోవైపు అంతే వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమమూ నడుస్తోంది. ఫైజర్, మోడెర్నాలు రెండు డోసులు వేసుకున్నాక కరోనా నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం పేర్కొంది. అలాగే వివిధ వ్యాక్సిన్ల సామర్థ్యంపై రోజుకో వార్త వినవస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న వ్యాక్సిన్‌లు, వాటి సామర్థ్యం(కంపెనీలు చెబుతున్న మేరకు), క్లినికల్‌ ట్రయల్స్‌ ఎంతమందిపై చేశారు.. అన్న వివరాలను ఈ గ్రాఫిక్‌లో చూసేద్దామా..   

టీనేజర్లకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ సేఫ్‌
వాషింగ్టన్‌: ఫైజర్‌ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ 12 ఏళ్ల వయసున్న వారిపై కూడా ప్రభావ వంతంగా పని చేయడమేగాక సురక్షితమంటూ ఫైజర్‌ కంపెనీ వెల్లడించింది. సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలల్లోకి వెళ్లేలోగా వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా కరోనాను నివారించ వచ్చని చెప్పింది. దీనికోసం త్వరలోనే యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోనున్నట్లు వెల్లడించింది.  

2,260 మందిపై ప్రయోగం..
టీనేజర్లలో వ్యాక్సిన్‌ సమర్ధతను పరీక్షించేందుకు 2,260 మంది వాలంటీర్లపై ఫైజర్‌ ప్రయోగాలు జరిపింది. ఇందులో 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లున్నారు. వారికి వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కోవిడ్‌ సోకలేదని స్పష్టం చేసింది. వారందరిలోనూ యాంటీబాడీలు వచ్చాయని తెలి పింది. అంతేగాక 18 ఏళ్లు దాటిన వారితో పోలిస్తే టీనేజర్లలో వ్యాక్సిన్‌ మరింత ప్రభావవంతంగా పని చేసినట్లు చెప్పింది. 

సాధారణ సైడ్‌ ఎఫెక్ట్‌లే..
ప్రయోగ సమయంలో టీనేజర్లలో స్వల్ప సైడ్‌ ఎఫెక్టులు కనిపించాయని ఫైజర్‌ పేర్కొంది. జ్వరం రావడం, వ్యాక్సిన్‌ వేసిన చోట నొప్పి, మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపింది. ఇవి అన్ని వయసుల వారిలోనూ కనిపించాయంది. మరోవైపు ఆస్ట్రాజెనెకా గత నెలలో 6–17 ఏళ్ల వయసున్న వారిపై బ్రిటన్‌లో పరిశోధనలు ప్రారంభించింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా తమ వ్యాక్సిన్‌ను పరీక్షించుకుంటోంది. చైనాలో తయారైన సినోవాక్‌ వ్యాక్సిన్‌ను ఏకంగా 3 ఏళ్ల వయసున్న పిల్లల నుంచే ఇవ్వొచ్చని చెబుతోంది.   

మరిన్ని వార్తలు