Nepal: ప్రధానితో ముందుగానే విమానం టేకాఫ్‌.. 31 మంది ప్రయాణికులు విలవిల

1 Dec, 2023 10:28 IST|Sakshi

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్‌- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్‌కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్‌కి బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్‌కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్‌ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది.

‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్‌-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్‌కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్‌లైన్ వివరించింది. 

యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ  ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్‌- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: ఎయిమ్స్‌ నుంచి కార్మికులు డిశార్జ్‌

మరిన్ని వార్తలు