కామన్‌వెల్త్‌, కర్రీ, క్రికెట్‌.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ

23 May, 2023 15:40 IST|Sakshi

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్‌ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్‌ ముందుంటుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమైంది.

అనంతరం ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మోదీ మాట్లాడారు. తనతోపాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ ఆస్ట్రేలియా వస్తానని 2014లోనే వాగ్దానం ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇ‍క్కడకు వచ్చానని తెలిపారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మంచి స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చదవండి: ఆ‍స్ట్రేలియాలో మోదీ మ్యాజిక్‌.. ఓ రేంజ్‌లో భారతీయుల స్వాగతం!

భారత్‌, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయన్నారు. కామన్‌వెల్త్‌, కర్రీ, క్రికెట్‌ మన రెండు దేశాలను కలుపుతున్నాయని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్‌ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్‌, ఆస్ట్రేలియాలను కలిపి ఉంచే మరో బంధం యోగా.. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం భారతదేశంలో జరిగిందన్నారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.  రెండు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఉందని ప్రధాని అన్నారు.

‘ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్‌ స్పందిస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్‌ ముందుంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్‌ అండగా నిలిచింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. త్వరలోనే బ్రిస్బెన్‌లో భారత కాన్సులేట్‌ ఏర్పాటు చేయబోతున్నాం. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ తెలిపారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ కూడా మోదీతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ.. మోదీ ప్రజాదరణను ప్రముఖ రాక్‌స్టార్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. ఆయన్ని అభిమానులు ప్రేమగా ‘ది బాస్‌’ అని కూడా పిలుస్తారు. ‘నేను ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను చూశాను. ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి కూడా లభించలేదు. ‘ప్రధాని మోదీ ది బాస్‌’ అని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు.

మరిన్ని వార్తలు