PM Shehbaz Sharif: తప్పడం లేదు.. మాజీ ప్రధాని వల్లే ఇలా జరిగింది

28 May, 2022 08:49 IST|Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ వ్యాఖ‍్యలపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

తమ దేశం(పాకిస్తాన్‌) దివాళా తీయకుండా ఉండేందుకే ఇంధన ధరలను పెంచడం తప్పనిసరి అని ప్రధానియ షరీఫ్‌ అన్నారు. పెట్రోలియం ధరల పెంపు నిర్ణయం కఠినమైనది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు.  గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఇమ్రాన్‌పై మండిపడ్డారు.

గత సర్కార్‌.. పెట్రోల్​ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ ఇచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్​ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్​ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్​ తేల్చిచెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్​ తెగెసి చెప్పింది. 

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. దీంతో లీటర్​ పెట్రోల్​ ధర రూ.179.85, డీజిల్​ లీటరు రూ.174.15, కిరోసిన్​ రూ.155.95, లైట్​ డీజిల్​ రూ.148.41కు ఎగబాకాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్​) పాక్​ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ధరలు పెంచామని పాక్‌ ఆర్థిక మంత్రి మిఫాత్​ ఇస్మైల్​ తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఉత్తరకొరియాకు భారీ ఊరట.. 

మరిన్ని వార్తలు