అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ సక్సెస్‌

18 Oct, 2021 01:36 IST|Sakshi

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్‌ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్‌ నోవిట్‌స్కీ, యులియా పెరెసిల్డ్, క్లిమ్‌ షిపెంకోలతో కూడిన సోయుజ్‌ అంతరిక్ష నౌక ఆదివారం కజఖ్‌స్తాన్‌లోని మైదాన ప్రాంతంలో దిగింది. ఆ వెంటనే యులియా, నోవిట్‌స్కీలు సీట్లలో ఉండగానే 10 నిమిషాలపాటు సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

ఆ ముగ్గురూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శకుడు షిపెంకో చాలెంజ్‌ అనే సినిమా చిత్రీకరణ కోసం నటి యులియాతో కలిసి ఈ నెల 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. సర్జన్‌ పాత్ర పోషిస్తున్న యులియా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ వ్యోమగామికి అత్యవసర చికిత్స చేసే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనారోగ్యం బారిన పడిన వ్యోమగామి పాత్రను ఇప్పటికే 6 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నోవిట్‌స్కీ పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్‌ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం. 

మరిన్ని వార్తలు