భర్త ఫోన్‌లో మెసేజ్‌లు తిరగేసిన రెండో భార్య! ఆపై ఏం జరిగిందంటే..

29 Aug, 2021 12:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘ఆయనకి ఇద్దరు’ అనే మాట కొందరు మగవారి జీవితాల్లో రహస్య వ్యవహారమే కానీ.. మొదటి భార్య అనుమతితో రెండో వివాహం చాలాచోట్ల సమ్మతమే. అయితే అతడికి సమస్యంతా రెండో భార్యతోనే వచ్చింది. సహజంగానే ఆడవారికి సవతిపోరు పడదు. అందుకే తెలివిగా వీలుచిక్కినప్పుడల్లా అతడి ఫోన్‌ నుంచి సీక్రెట్‌గా మొదటి భార్య(సవతి)తో అతడిలానే చాట్‌ చేసి.. కథను విడాకులు దాకా లాక్కొచ్చింది రెండోభార్య. విషయం తెలుసుకున్న అతగాడు లబోదిబోమంటూ కోర్టుకెక్కాడు. రెండో భార్యపై కేసు వేశాడు. నష్టపరిహారంతో పాటు జైలు శిక్ష కూడా పడేలా చేశాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: ఫేస్‌బుక్‌లో పరిచయం.. వాట్సాప్‌లో మరింత క్లోజ్‌, చివరికి!

అసలు ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. వేర్వేరు ఇళ్లల్లో ఉంచాడు. ఇద్దరినీ చక్కగానే చూసుకుంటున్నాడు. అయితే రెండో భార్యకి కొంచెం పొజెసివ్‌నెస్‌ ఎక్కువ. తన భర్త తన సవతికి దగ్గరవ్వడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. దాంతో ఆమె అతడికి తెలియకుండా, అతడి ఫోన్‌ రహస్యంగా తీసుకుని మొదటి భార్యతో అతడు చేసిన చాటింగ్‌ మొత్తం చదివేది. అతడి ఈ–మెయిల్స్‌ కూడా తెరిచి చూసేది. కొన్ని మెసేజులకు కోపం తెప్పించేలా రిప్లైలు ఇచ్చేది. దాంతో మొదటి భార్యకు అతడికి చాలా మనస్పర్థలు వచ్చాయి. ఆ గొడవలు కాస్త ముదిరి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. అంతటికీ కారణం తన రెండో భార్యేనంటూ కోర్టును ఆశ్రయించాడు.

చదవండి: పబ్‌–జీ ఖర్చు 10 లక్షలు

తన రెండో భార్య కారణంగానే తన మొదటి భార్యతో విడిపోవాల్సి వచ్చిందని, అందుకుగాను తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, చివరికి కోర్టు వ్యవహారాల్లో తలమునకలై ఉద్యోగం కూడా పోగొట్టుకున్నానని.. అన్ని ఖర్చుల నిమిత్తం పరిహారం ఇప్పించమని జడ్జిని దీనంగా వేడుకున్నాడు. రాస్‌ అల్‌ ఖైమా సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఈ కేసుని పరిశీలించి.. భర్త ఫోన్లలో అతడికి  తెలియకుండా మెసేజులు చదవడమంటే అతడి ప్రైవసీకి భంగం కలిగించే చర్యేనని తేల్చి.. నష్ట పరిహారంగా 8,000 దిర్హామ్‌లు అంటే సుమారు లక్ష అరవై నాలుగు వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అంతే కాకుండా కోర్టు ఖర్చులకు మరో రూ.42 వేలు చెల్లించడంతో పాటు ఆమెకు ఒక నెల రోజులు జైలు శిక్ష కూడా విధించారు. 

చదవండి: చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి..
  

మరిన్ని వార్తలు