దారుణం: 150సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయని భార్య.. అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ..

8 Nov, 2023 17:36 IST|Sakshi
కిషోర్‌, ప్రతిభల ఫైల్‌ ఫొటో

అనుమానం.. పెనుభూతం అంటారు. అతని విషయంలో అది ఉన్మాదం వైపు అడుగులేయించింది.  పెళ్లి అయిన తొలినాటి నుంచే భార్యపైనా అనుమానం పెంచుకున్నాడు. అది అతన్ని ఆమె ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు పరిశీలిస్తూ.. మాట్లాడే ప్రతి ఒక్కరి గురించి ఆరా తీసే స్థాయికి దిగజార్చింది. చివరకు.. పండటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను గొంతు నులిమి కడతేర్చే కిరాతకానికి పాల్పడ్డాడు.

తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అత్తగారింటికి వెళ్లి తన భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదకొండు రోజుల క్రితమే ఈ దంపతులకు ఓ పాప పుట్టడం గమనార్హం. 

కిషోర్(32) ప్రతిభ(24) నవంబర్ 13, 2022న వివాహం చేసుకున్నారు. 11 రోజుల క్రితమే వారికి ఓ పాప పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె అమ్మ ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కిశోర్ నిత్యం అనుమానించేవాడు. ఆమె మెసేజ్‌లు, కాల్ రికార్డులను తరచుగా పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే  ప్రతి వ్యక్తి గురించి ఆరా తీసేవాడు.  కాలేజీ నాటి పురుష స్నేహితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు చేసేవాడని పోలీసులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ప్రతిభ ఫోన్‌లో విలపించడంతో ఆమె తల్లి జోక్యం చేసుకుని కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్‌కు సమాధానం ఇవ్వవద్దని ఆమె ప్రతిభకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. 

సోమవారం ఉదయం కిషోర్ తనకు 150 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ప్రతిభ.. తన తల్లిదండ్రులకు తెలిపింది. భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కిషోర్‌ రగిలిపోయాడు. చామరాజనగర్‌ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్‌.. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నాడు.

కిషోర్ మొదట పురుగుల మందు తాగి, నవజాత శిశువుతో ప్రతిభ  ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసాడు. దుపట్టాతో ప్రతిభ గొంతునులిమి హత్య చేశాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చిన కిశోర్.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. చికిత్స పూర్తి కాగానే కిషోర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:  ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్‌

మరిన్ని వార్తలు